తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని, అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు.
నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు. తెలంగాణలో వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాలపై ప్రగతి భవన్లో ఇవాళ సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5,000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. దాంతో మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతే కాకుండా ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.