తెలంగాణలోని 31జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ద్వారా ప్రభుత్వం పథకాలు సమర్థవంతంగా అమలు కావాలని సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి పేదరికం ఉన్న కుటుంబాలను గుర్తించాలి. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. కొత్త జిల్లాలు బాగా స్థిరపడాలని ఆదేశించారు. కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కలెక్టర్ల పనితీరు నాకు సంతోషాన్నిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇదే ఉత్సాహంతో పనిచేస్తే త్వరలోనే అనుకున్న లక్ష్యాలను అందుకుంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అద్భుత మానవ శక్తి ఉంది. మానవ వనరులు గుర్తించి ప్రోత్సహించాలి. కరీంనగర్ పిలిగ్రీ ఆర్ట్స్, జనగామ-పెంబర్తిలో నగిషీ కళాకారులు ప్రపంచ ఖ్యాతిని పొందారు. తెలంగాణ రాష్ట్రం 19.5 వృద్ధిరేటుతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. భవిష్యత్‌లో కూడా తెలంగాణ ఇదే రకమైన వృద్ధిరేటు కొనసాగిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు అవగతం చేసుకుని పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోగ్రామీణ ప్రాంతం ఎక్కువ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. రిసోర్స్ మ్యాపింగ్‌లో మానవ వనరులను గుర్తించాలని సూచించారు.
తెలంగాణ జనాభాలో 16-17 శాతం ఎస్సీలు, 10శాతం ఎస్టీలు, 50శాతం మహిళలు ఉన్నారు. ఎస్టీలను తండాలకు, ఎస్సీలను గూడాలకు, మహిళలను ఇంటికి పరిమితం చేస్తున్నారు. 75 శాతం మానవ వనరులను ఉపయోగించుకోవట్లేదు. ఈ రుగ్మతను పోగొట్టాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. మానవ వనరులను వృథాగా ఉంచొద్దని చెప్పారు.
రాష్ట్రంలో 25లక్షల మంది యాదవులున్నారు. గొర్రెల పెంపకంలో అనుభవం, నైపుణ్యం ఉంది. గొర్రెల పెంపకం పెద్దఎత్తున చేపట్టాలని చెప్పారు. ప్రతిరోజు 500లారీల గొర్రెలు రాష్ట్రానికి దిగుమతి కావడం బాధాకరం. గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితికి తెలంగాణ రావాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. రాష్ట్రంలో గొర్రెల పెంపకం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో చేపల పెంపకం పెద్ద ఎత్తన జరగాలి. మిషన్ కాకతీయ ద్వారా బాగుచేసిన చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. గోదావరి, కృష్ణా బేసిన్లలో భారీ, మధ్యతరహా నీటిప్రాజెక్టులెన్నో ఉన్నాయి. కొత్తగా అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు కడుతున్నాం. వాటన్నింటినీ చేపట పెంపకానికి ఉపయోగించుకోవాలి. అందుకోసం అనువైన కార్యాచరణ రూపొందించి అధునిక పద్దతులను అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో సెలూన్ల పరిస్థితి మెరుగుపడాలి. గ్రామాల్లో హైజనిక్ సెలూన్లు రావాలి. దానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. సెలూన్లు నడిపే వారిని గుర్తించాలని అధికారులకు తెలిపారు.
దళితులు, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ఆ నిధులను క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ శాఖలకే ఆ నిధులు కేటాయించి ఖర్చు చేస్తామన్నారు. జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ ప్లాన్ సిద్ధం చేయాలి. బడ్జెట్ ప్రవేశపెట్టేలోగా జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాలి. వ్యవసాయం, స్వయం ఉపాధి, పరిశ్రమలు వంటి రంగాల్లో ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వాటి నిర్మాణం కోసం స్థలాలు గుర్తించుకోవాలి. సమాజంలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీసీల అభివృద్ధి, కుల వృత్తులకు ప్రోత్సాహం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.