ఈరోజు సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని యశ్వంత్‌పూర్ వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. జనగామ జిల్లాను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా.. అద్భుతమైన పరిపాలన భవనం కలెక్టరేట్‌ను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా జిల్లా అధికారులను, ప్రజలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. జయశంకర్ సార్ బతికున్నప్పుడు ఉద్యమ సమయంలో పర్యటిస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక బాధలు ఉండేవి. కళ్లకు నీళ్లు పెట్టుకున్నాం. బచ్చన్నపేట మీదుగా పోతుంటే.. మాట్లాడాలంటే చౌరస్తా వద్ద ఆగాను. అక్కడ ఒక్క యువకుడు కూడా లేడు. మొత్తం ముసలివారే. కరువు వచ్చి ఏడేండ్లు అవుతుంది. మంచినీళ్లు కూడా బండి మీద తెచ్చుకుంటున్నాం అని చెప్తే ఆవేశం పట్టలేక ఏడ్చాను.
అనేక సందర్భాల్లో నీళ్ల కోసం ముత్తిరెడ్డి.. రాజయ్య, సునీతతో కొట్లాడాడు. చాలా కష్టపడి నీళ్లు తెచ్చుకున్నాం. ప్రజల దీవెనతో అద్భుతంగా ముందుకు పోతున్నాం. కొన్ని మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడే ముఖం తెల్లపడుతుంది. బచ్చన్నపేట వద్ద బతుకులు బాగుపడుతున్నాయి. పంటలు మోయలేనంత పండిస్తున్నారు. ఇండ్లకే మంచినీళ్లు వస్తున్నాయి. 365 రోజులు గోదావరి నీళ్లు తెచ్చి జనగామ పాదాలు కడిగే రంగం సిద్ధమైంది. సాగునీటి సమస్య కొంత ఉంది. అది కూడా త్వరితగతిన పరిష్కరిస్తాం. దేవాదుల నుంచి నీళ్లు వస్తాయి. ఒక్క ఏడాది కాలంలోనే అన్ని గ్రామాల్లోని చెరువు నింపే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఉంది. ఏప్రిల్ నెలలో కూడా చెరువులు మత్తడి దుంకాలి. ఘనపురంలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. జనగామకు తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం. రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తాం. పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.