తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు, ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయించారు. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంచాలని… జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చేరవేయాలన్నారు. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశం అయితే కావలసినంత సమయం కేటాయించాలన్నారు.
తెలంగాణా అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ నిర్వహణలో తెలంగాణా శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సభ్యుల సంఖ్య తక్కువ ఐనా విపక్షాలకు సమయం ఎక్కువగానే కేటాయిస్తున్నామని…ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందన్నారు.