ఇప్పుడున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు, రిజిస్ట్రార్లను యధావిధిగా కొనసాగిస్తూనే..ప్రతీ మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాల్లో కొత్తవి నెలకొల్పి, కొత్తగా ఏర్పాటు చేసే రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రార్లుగా మండల రెవెన్యూ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. అవినీతికి, జాప్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ విభాగంలో పెద్దఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మండల స్థాయిలోనే రిజిస్ట్రార్ కార్యాలయం ఉండడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
కోర్ బ్యాంకింగ్ విధానంలాగానే ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాల వివరాలన్నీ ఇకపై ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో అప్ డేట్ అవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో భూ రికార్డుల నిర్వహణ కోసం, కోర్ బ్యాంకింగ్ తరహాలో భూముల క్రయ విక్రయాల వివరాల నమోదు వెయ్యి మంది ఐటి అధికారులను నియమించాలని సిఎం ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయిన రోజే మ్యుటేషన్ కూడా పూర్తి కావాలన్నారు.
‘‘గతంలో భూమి శిస్తు వసూలు చేసే వారు. దానికి అనుగుణంగా పహాణీలు తయారు చేశారు. కానీ ఇప్పుడు భూమి శిస్తు వసూలు చేయడం లేదు. పైగా ప్రభుత్వమే ఎకరాకు 8వేల చొప్పున పెట్టుబడి ఇస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పహాణిలో వున్న 31 కాలమ్స్ అవసరం వుందా లేదా అనే ఆలోచన చేయాలి. కేవలం రైతుల ఖాతాల వివరాలు మాత్రమే ఉంచి, మిగతావి తొలగిస్తే సరళంగా ఉంటుంది. గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అటవీభూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల రికార్డులను ప్రత్యేకంగా నిర్వహించాలి.
భూ వివాదాలకు సంబంధించి కూడా ఇన్ని కోర్టులు అవసరం లేదు. కలెక్టర్ కోర్టు ఒక్కటే ఉండాలి. మిగతావి రద్దు చేయాలి. పట్టాదారు పాసు పుస్తకాల్లో, పహాణీల్లో వాడే భాష సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అర్థం కాని పదాల బదులు అందరికీ అర్థమయ్యే తెలుగు భాషను వాడాలి. పహాణీలను కంప్యూటర్లో డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండాలి. వ్యవసాయ శాఖకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేకమైన బడ్జెట్ రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో సమావేశం నిర్వహిం చి, విధి విధానాల ఖరారు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.