జంతర్ మంతర్‌లో CJP నిరసన

2
- Advertisement -

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించింది. NEET-2026, CBSE పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, ఫలితాల నిర్వహణలో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడమే ఈ ఆందోళన ప్రధాన ఉద్దేశ్యమని పార్టీ నాయకులు తెలిపారు.

అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్వయంగా ఈ నిరసనకు నాయకత్వం వహించారు. జంతర్ మంతర్‌కు చేరుకునే ముందు ఆయన నిరసనకారులను శాంతియుతంగా వ్యవహరించాలని… జాతీయ జెండాను వెంట తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా… అహింసాత్మకంగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించగా, పలు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టారు.

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాల వల్ల తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలంటే ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వేగంగా ప్రాచుర్యం పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువత సమస్యలు, నిరుద్యోగం, విద్యా రంగ సంక్షోభాలపై గళమెత్తుతూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నిరసన ఆ ఉద్యమం చేపట్టిన తొలి ప్రధాన వీధి ఆందోళనగా భావిస్తున్నారు.

ALso Read:లోక్‌సభకు మమతా బెనర్జీ!

- Advertisement -