నా పేరు శివ,యుగానికి ఒక్కడు,అవారా,ఊపిరి వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్న హీరో కార్తీ. తమిళంలో చేసే ప్రతిసినిమా తెలుగులో విడుదల చేస్తూ మంచి మార్కెట్ సంపాదించుకున్న కార్తీ తాజాగా చినబాబు అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. కెరీర్‌లో తొలిసారి రైతుపాత్రలో నటించిన కార్తీ ఈ చిత్రంతో ఆకట్టుకున్నాడా..?చినబాబుగా
ప్రేక్షకులను మెప్పించాడా లేదా చూద్దాం…
కథ:
రుద్రరాజు(సత్యరాజ్)ది ఉమ్మడి కుటుంబం. కుటుంబం అంటే ప్రాణం. తన కుటుంబసభ్యుల్ని అపురూపంగా చూసుకుంటాడు. చినబాబు(కార్తీ)కి ఇద్దరు మరదళ్లు. కానీ చినబాబు మాత్రం నీల (సాయేషా సైగల్)ను ఇష్టపడతాడు. కానీ నీలను పెళ్లిచేసుకోవడం అక్క, బావలకి ఇష్టం ఉండదు. దీంతో కుటుంబసభ్యులను ఒప్పించేందుకు చినబాబు ఎలాంటి పాట్లు పడ్డాడు..?తండ్రి చెప్పినట్టే చేశాడా..?చివరికి నీల-చినబాబు కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కార్తీ నటన,కథ,కామెడీ. ఉమ్మడి కుటుంబనేపథ్యంలో చాలా సినిమాలు వచ్చిన వాటికి భిన్నంగా డిఫరెంట్‌గా సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ సాధించాడు దర్శకుడు. ఇక ఐదుగురు అక్కల ముద్దుల తమ్ముడిగా కార్తీ ఇరగదీశాడు. ఓ వైపు కామెడీని మరోవైపు సెంటిమెంట్‌ని అద్భుతంగా పండించాడు. తన అందంతో సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది సాయేషా. నీలగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రధాన బలం తమిళ కమెడియన్ సూరి. అతను పండించిన కామెడీ, పంచ్‌లు నవ్విస్తాయి. మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ తమిళ నేటివిటి ఎక్కువగా ఉండటం. తమిళ రిమేక్ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తెరకెక్కించడంలో జాగ్రత్త వహిస్తే బాగుండేది. నటులంతా తమిళ వాళ్లే కావడం, తమిళ వాసనలు ఎక్కువగా ఉండటం లాంటి నెగటివ్ పాయింట్స్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు ఎలాంటి వంకలు పెట్టలేం. చక్కని పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు వందశాతం సక్సెస్ సాధించాడు. ఉమ్మడి కుటుంబంలోని మనుషుల వ్యక్తిత్వాన్ని అర్థవంతంగా చూపించగలిగాడు. మాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఆర్. వేల్ రాజ్ పనితనం ,రూబెన్ ఎడిటింగ్ వర్క్‌ను మెచ్చుకొని
తీరాల్సిందే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం చినబాబు. కార్తీ నటన,కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా తమిళ నేటివిటి మైనస్ పాయింట్స్. కుటుంబమంతా కలిసుండాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా కనెక్టవుతుంది. ఓవరాల్‌గా ఉమ్మడి కుటుంబం విలువలను కళ్లకు కట్టినట్టు చూపించే సినిమా చినబాబు.
విడుదల తేదీ:13/07/2018
రేటింగ్:2.75/5
నటీనటులు: కార్తి, సాయేషా సైగల్
సంగీతం: డి. ఇమాన్
నిర్మాత: సూర్య
దర్శకత్వం: పాండిరాజ్