మూసీనది సుందరీకరణ పనులపై సీఎస్ సమీక్ష..

255
Chief Secretary S K Joshi
- Advertisement -

మూసీనది సుందరీకరణ, జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, రోడ్ సేఫ్టీ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మూసీ సుందరీకరణ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, రోడ్ సేఫ్టీ నిర్మాణాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

మూసీనది సుందరీకరణ పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని, నిర్ణీత కాల పరిమితితో కూడిన కార్యచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు.మూసీనదిలో డెబ్రిస్ తొలగింపు కార్యక్రమాలను ఈవీడీఎమ్‌( డైరెక్టర్‌) విశ్వజిత్ పర్యవేక్షణలో ప్రత్యేక టీంల ద్వారా చేపట్టాలని, దీనికి అవసరమైన లారీలను, జెసిబిలను, సిబ్బందిని సమకూర్చుకోవాలని అన్నారు. మూసీనదిలో తొలగించిన డెబ్రిస్ రవాణాకు సంబంధించి తాత్కాలిక డంపింగ్ పాయింట్స్ ను గుర్తించాలని తెలిపారు. మూసినదిలో డెబ్రిస్ కు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బ్లూ షీట్స్ ఏర్పాటు చేసి చెత్త వేయకుండా అరికట్టాలన్నారు.

Chief Secretary S K Joshi

మూసీనదిలో గోదావరి నది ద్వారా స్వచ్ఛమైన జలాలు పంపింగ్ చేసేలా ప్రణాళికను రూపొందించాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. మూసీనది హై టెన్షన్ లైన్ల తరలింపు గురించి జాయింట్ ఇన్ స్పెక్షన్ చేసి ఎస్టిమేట్ రూపొందించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. మూసీనది రివర్ బెడ్, బఫర్ జోన్లలో ఉన్న ఆక్రమణలపై నెలలోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆక్రమణకు సంబంధించి సోషియో, ఎకనామిక్, డెమోగ్రాఫికల్ వివరాలు సర్వేలో ఉండాలన్నారు. భవిష్యత్తులో ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. వివిధ ఆక్రమణలకు సంబంధించి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి సంప్రదింపుల ద్వారా ఆక్రమణల తొలగింపుకు కృషి చేయాలన్నారు.

మూసీనది సుందరీకరణకు సంబంధించి అంతర్జాతీయ డిజైన్ కాంపిటీషన్ ను నిర్వహించామని, 10 సంస్ధలు రిజిష్ట్రర్ చేసుకొని 9 సంస్ధలు డిజైన్లు సమర్పించాయని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ సి.యస్ కు వివరించారు. మూసీనదిలో ఆక్రమణల తొలగింపును ప్రత్యేక వ్యూహంతో చేపడుతామని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. మొదటిదశలో 3 కిలోమీటర్లలో పనులు చేపట్టి పచ్చదనం, సుందరీకరణ చేస్తామని వివరించారు. రెండవ దశలో కలుషిత నీరు కలువకుండా వివిధ ప్రాంతాలలో ఎస్‌టీపీ లను నిర్మిస్తామన్నారు.

శుద్ది చేసిన నీటిని వ్యవసాయ, హార్టికల్చర్ అవసరాలకు వినియోగిస్తామని, వ్యర్ధాలు కలవకుండా అవసరమైన చోట్ల ఎస్‌టీపీలు ఏర్పాటు చేసేలా సమీకృత ప్రణాళికను రూపొందిస్తున్నామని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ సి.యస్ కు వివరించారు. మూసీనది పరివాహకంలో సర్వే, ఆక్రమణల తొలగింపు అనంతరం పునరావాస కార్యక్రమ అనంతరం ప్రత్యక శ్రద్ధవహించి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తామన్నారు. బాపుఘాట్ పరిసరాలలో మూసీ,ఈసీ నది సంగమం వద్ద టూరీజం కు సంబంధించిన 61 ఎకరాల స్ధలంలో టూరీజం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నారు.

Chief Secretary S K Joshi

ఇక డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సి.యస్ సమీక్షిస్తూ జిహెచ్ఎంసి పరిధిలోని 109 ప్రాంతాలలో చేపడుతున్న లక్ష ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. జిహెచ్ఎంసి, మున్సిపాలిటీలలో ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల ప్రతిపాదనలు, నెలల వారిగా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో అవసరమైన పోలీసు అవుట్ పోస్ట్‌లు, ఫైర్ స్టేషన్లు, సి.సి కెమరాల ఏర్పాట్లు, ఎక్స్ టర్నల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌లకు సంబంధించి ప్రతిపాదనలు సంబంధిత శాఖలు రూపొందించి ఇవ్వాలన్నారు. రోడ్ సేప్టికి సంబంధించి జోనల్ కమీషనర్లు, లోకల్ పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేసి ప్రతిజోన్ పరిధిలో ట్రాపిక్ ఐలాండ్ నిర్మాణాలకు సంబంధించి ప్రాంతాలను గుర్తించాలని సి.యస్ ఆదేశించారు. పాదాచారుల కోసం అవసరమైన జీబ్రా క్రాసింగ్స్, సేఫ్టీ కోసం జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల వెడల్పు తదితర పనులు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామ కృష్ణారావు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, మెట్రో రైల్ యం.డి. ఎన్.వి.ఎస్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, మేడ్చల్ కలెక్టర్ యం.వి రెడ్డి, హెచ్ఎండిఏ కమీషనర్ టి.చిరంజీవులు, జిహెచ్ఎంసి అదనపు కమీషనర్ భారతి హోళికేరి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్,అదనపు పోలీస్ కమీషనర్ ట్రాఫిక్ అనీల్ కుమార్, ఈవీడీఎమ్‌( డైరెక్టర్‌) విశ్వజిత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -