రెండుగా చీలిన పాలమూరు కాంగ్రెస్‌…!

281
chinnareddy
- Advertisement -

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రెబల్ బెడద కాంగ్రెస్ పార్టీ నేతలను కలవరపెడుతోంది. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీమంత్రి, సీనియర్ నేత చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. చిన్నారెడ్డిని గెలిపించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పట్టును నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా పని చేస్తున్నారు. అయితే చిన్నారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచే రెబల్ అభ్యర్థిగా హర్షవర్థన్ రెడ్డి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడిదే కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతోంది. హర్షవర్థన్ రెడ్డి గత రెండేళ్లుగా టీపీసీసీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ఆయన ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ వచ్చారు. గతంలో పీఆర్టీటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడైన హర్షవర్థన్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో మంచి గుర్తింపును సాధించడంతో తనకు ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని హర్షవర్ధన్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే అధిస్టానం చిన్నారెడ్డి పేరును ఖరారు చేయడంతో హర్షవర్ధన్ రెడ్డి వర్గం ఖంగుతింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా అయినా రంగంలోకి దిగాలని అనుచరులు ఒత్తిడి చేయడంతో హర్షవర్థన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారంట..ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల్లో హర్షవర్థన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ.. జోరుగా ప్రచారం చేస్తున్నారంట… మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి అభ్యర్థిత్వం ఇటీవలే ఖరారు కావడంతో ఇప్పటి వరకు పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన దాఖలా లేదంట… దీంతో కాంగ్రెస్ లోని ఒక వర్గం చిన్నారెడ్డి కన్నా హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలవడం ఖాయమని అధిష్టానానికి చెబుతున్నారంట..అయితే కాంగ్రెస్‌లోని మరో వర్గం మాత్రం నిరాడంబరుడైన చిన్నారెడ్డి సరైన అభ్యర్థి అని వాదిస్తోందంట.

దీంతో పాలమూరు కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. తన అభ్యర్థిత్వంపై హర్ష వర్థన్ వర్గం చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై ఆగ్రహించిన చిన్నారెడ్డి ఈ విషయాన్ని నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో రెబెల్స్ బెడద లేకుండా చూస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారంట. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం పిలుపుమేరకు హర్షవర్ధన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో సమావేశమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుని చిన్నారెడ్డి కి మద్దతు ఇస్తే, 2023లో వచ్చే టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హర్షవర్థన్‌రెడ్డికి నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై అనుచరులతో మాట్లాడి ఒకటి రెండు రోజుల్లో చెబుతానని హర్షవర్ధన్ రెడ్డి ఆ మీటింగ్‌ నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చినట్లు సమాచారం. కాగా పట్టభద్రుల స్థానం నుంచి ఈసారి పోటీ చేసి తీరాల్సిందేనని హర్షవర్థన్ పై ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారంట. అయితే రెబల్ అభ్యర్థిగా లేకుంటే పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని హర్షవర్థన్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికలలో చిన్నారెడ్డి గెలుపు అవకాశాలకు ‍ఆయన గండికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి మళ్లీ తమ సత్తా చాటుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ నేతలకు హర్షవర్థన్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది.

- Advertisement -