ఈ గోడ సాయం చేస్తుంది..!

232
Wall of Kindness
Wall of Kindness
- Advertisement -

సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ హల్‌ చల్ చేస్తోంది. ఈ ఫోటోను నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ వ్యాఖ్యలు నిజామాబాద్ పట్టణంలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీ దారిలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఉన్న గోడపై రాసి ఉన్నాయి. దీన్ని స్థానిక మున్సిపల్ అధికారుల సహకారంతో నిజామాబాద్ కు చెందిన డాక్టర్ శ్రావణీ శ్రీనివాస్ దంపతులు సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాళ్లు మొదలుపెట్టిన వాల్ ఆఫ్ కైండ్ నెస్ ఇప్పుడు నలుగురికీ ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగం లేనివి ఇక్కడ వదలండి, మీకు అవసరమైనవి కావాలంటే తీసుకెళ్లండి అని గోడ మీద రాసిన కొటేషన్స్ పది మందినీ కదిలిస్తున్నాయి.

వాల్ ఆఫ్ కైండ్ నెస్ పేరుతో డాక్టర్ శ్రావణీ శ్రీనివాస్ దంపతులు చేస్తున్న సేవా ప్రయత్నానికి స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది. వాళ్లను చూసి ఇంకా చాలా మంది తోచింది దానం చేసి వెళ్తున్నారు. సాయం చేయాలన్న ఆలోచన ఉన్న వారికి ఇదొక మంచి వేదికగా మారింది. డాక్టర్ దంపతులు శ్రావణీ శ్రీనివాస్ పదిహేనేళ్లుగా నిజామాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పేదవారి కోసం ఏదైనా చేయాలన్న తపన భార్యభర్తలిద్దరికీ ఉండేది. వెంటనే మున్సిపల్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని, జూన్ 4 నాడు వాల్ ఆఫ్ కైండ్ నెస్ కు శ్రీకారం చుట్టారు. ముందుగా డాక్టర్ దంపతులే పాత బట్టలను గోడకు తగిలించడం మొదలు పెట్టారు. మెల్లగా స్థానికులు కూడా తమవంతుగా ఉపయోగం లేనివి వదిలేసి వెళ్తున్నారు. ఇప్పుడా గోడ ఖాళీలేదు. హ్యాంగర్ల నిండా బట్టలున్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్లు తీసుకెళ్తున్నారు.

nzb-wall-of-kind-ness

చిన్న పిల్లలు పాత పుస్తకాలను, స్కూల్ బ్యాగులను గోడ దగ్గర వదిలి వెళ్తున్నారు. ఒక్క బట్టలే కాదు చెప్పులు, ఆట బొమ్మలు, ఇతర వస్తువులను కూడా గోడకు తగిలించి వెళ్లొచ్చు. వాటిని కావాల్సిన వారు నిరభ్యంతరంగా తీసుకొని పోతారు. దీనివల్ల సాయం చేయాలనుకునే వారి కోరిక తీరుతోంది. అవసరం ఉన్నవారికి వస్తువులు దొరుకుతున్నాయి.ఇంతకంటే ఆనందం ఇంకేముంటుందంటున్నారు డాక్టర్ దంపతులు. ఈ ఆలోచనను నిజామాబాద్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే చాలా బాగుంటుందని స్థానికులు అంటున్నారు. అటు డాక్టర్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదే కాన్సెప్ట్ హైదరాబాద్ లోనూ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రాజేంద్రనగర్ లోని ఓ గోడకు ‘వాల్ ఆఫ్ కైండ్ నెస్’ రాసి..ఈ కొత్త ఆలోచనకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.ఈ కాన్సెప్ట్ ను నగరమంతా విస్తరిస్తామని, వర్షకాలంలో దాతలు ఇచ్చే వస్తువులు తడవకుండా ఉండేందుకు రేకుల షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ ఉద్యమంలో భాగంగా స్వచ్ఛ రాజేంద్రనగర్ కార్యక్రమాన్ని చేపట్టామని.. వాల్ ఆఫ్ కైండ్ నెస్ కు విశేష స్పందన వస్తుందని అధికారులు చెప్పారు.

- Advertisement -