మహానటిపై చంద్రబాబు ప్రశంసలు..

225
Chandrababu praises Mahanati Movie
- Advertisement -

తెలుగు సినిమా చరిత్రలో క్లాసికల్ హిట్‌గా నిలిచిన చిత్రం మహానటి. తెలుగులో వచ్చిన మొట్టమొదటి బయోపిక్ చిత్రం కావడం,స్టార్‌ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా సగటు ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో మంచి వసూళ్లను రాబడుతోంది. సావిత్రి జీవితం,ఆమె అనుభవాలను నేటి తరానికి కళ్లకు కట్టిచూపించారు. అద్భుత దృశ్యకావ్యంలా నిలిచిన మహానటిపై విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు.

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు మహానటిపై ప్రశంసలు గుప్పించారు.టీడీఎల్పీ సమావేశంలో సావిత్రి బయోపిక్ మహానటి సినిమా గురించి నాయకులను అడిగి తెలుసుకున్నారు. మహానటి బాగుందని ఎయిర్‌పోర్టులో కొంతమంది చెప్పారన్నారు. సినిమాలో మంచి సందేశం ఉందని, ఆ సినిమా తప్పకుండా చూస్తానని సీఎం అన్నారు. జీవిత చరిత్రలపై సినిమాలు సరిగా తీస్తే ప్రజలు ఆదరిస్తారన్నారు.

మంత్రి కేటీఆర్‌ సైతం మహానటి…అద్భుతమని కొనియాడిన సంగతి తెలిసిందే. సావిత్రి పాత్ర‌కి కీర్తి సురేష్ జీవం పోసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు తెలిపారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ త‌న ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు.

సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు,రాజమౌళితో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా ఎంత బాగుంది అంటే.. ఎంత బాగుందో చెప్పలేనంత అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు నాని. ‘కీర్తి సురేశ్‌ తప్ప మరెవ్వరూ సావిత్రి గారి పాత్రను ఇంత బాగా పోషించలేరు. నాగి (డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌) ని చూస్తే గర్వంగా ఉంది. స్వప్నా, ప్రియాంక, దుల్కర్‌, సామ్‌, విజయ్‌ అందరికీ ధన్యవాదాలు అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఓవరాల్‌గా మహానటి పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లను రాబడుతోంది.

- Advertisement -