ప్రపంచ ఇంధన సరఫరాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో ఎల్పీజీ కొరత ఉందనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో ఇంధన కొరత ఏమీ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో ఆందోళన ఉన్నప్పటికీ భారత్‌లో ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంధనం అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
అంతేకాదు సంబంధిత శాఖలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయని, ప్రాంతీయ పరిణామాలపై కచ్చితమైన నిఘా ఉంచి దేశీయ సరఫరా వ్యవస్థను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
“దేశంలో ఇంధన కొరత అసలు లేదు. ప్రస్తుతం పెద్ద యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతాయి. వాటిపై సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తాయి. ప్రభుత్వం పరిస్థితిని చాలా దగ్గరగా గమనిస్తోంది,” అని పీయూష్ గోయల్ అన్నారు.
Also Read:సత్యవతిగా రీతు!
అంతర్జాతీయ సరఫరా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన మార్కెట్‌ను స్థిరపరచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. మంగళవారం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

