మరింత ఉద్రిక్తంగా మారిన హార్మూజ్ జలసంధి!

8
- Advertisement -

అమెరికా–ఇరాన్ ఘర్షణ హార్మూజ్ జలసంధిలో మరింత తీవ్రంగా మారింది. ఇరాన్‌కు చెందిన మైన్‌లు వేస్తున్న పడవలపై అమెరికా దాడి చేసి 10కి పైగా పడవలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ చర్యలకు సంబంధించిన వీడియోలను కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. మరోవైపు ఇరాన్ మాత్రం ఇప్పటికే వేల సంఖ్యలో సముద్ర మైన్‌లు ఏర్పాటు చేసినట్లు చెబుతూ శత్రు దేశాల నౌకలకు హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోల్లో ఇరాన్‌కు చెందిన నౌకలు, సబ్‌మరైన్లు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల ప్రయాణం భద్రంగా కొనసాగేందుకు ఇరాన్ నౌకాదళ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ దాడుల ఉద్దేశమని అమెరికా అధికారులు తెలిపారు.

ఇక ఇరాన్ అధికారులు మాత్రం ఇప్పటికే జలసంధిలో మైన్‌లు ఏర్పాటు చేయడం ప్రారంభించామని పేర్కొన్నారు. “ఏ శత్రు దేశ నౌక కూడా హోర్ముజ్ గుండా వెళ్లనివ్వం. ఎవరికైనా సందేహం ఉంటే దగ్గరికి వచ్చి ప్రయత్నించండి” అని ఒక ఇరాన్ కమాండర్ హెచ్చరించినట్లు సమాచారం.

అంతేకాదు, ఇరాన్ వద్ద సుమారు 6,000 సముద్ర మైన్‌లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలోని రెండు మైళ్ల వెడల్పు ఉన్న కీలక మార్గంలో ఇవి వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని అత్యాధునిక సెన్సార్ ఆధారిత మైన్‌లు ఉండి గుర్తించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. “ఇరాన్ వెంటనే హోర్ముజ్ జలసంధిలో వేసిన అన్ని మైన్‌లను తొలగించాలి. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా పలు క్షిపణులు ప్రయోగిస్తున్న వీడియోను విడుదల చేసింది.

Also Read:సత్యవతిగా రీతు!

ఈ ఘర్షణ కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. హోర్ముజ్ జలసంధి కొంతవరకు మూసుకుపోయిన పరిస్థితుల్లో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అమెరికా నౌకాదళం ఒక నౌకను సురక్షితంగా జలసంధి గుండా తీసుకెళ్లినట్లు ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటనను కొద్దిసేపటికే వెనక్కి తీసుకున్నారు. దీంతో అమెరికా ప్రభుత్వంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -