కరోనా టీకా పంపిణీకి కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు..

248
corona vaccine
- Advertisement -

కరోనా వైరస్ వ్యాప్తి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతోపాటు వృద్ధులకు టీకా ఇవ్వాలని కేంద్రం భావిస్తున్న‌ది. ఈ మేర‌కు కొవిడ్ వ్యాక్సినేష‌న్‌పై కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది.

వ్యాక్సిన్‌ కావాలనుకునేవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారినే టీకా కేంద్రాల్లోకి అనుమతించాలని కేంద్రం పేర్కొన్న‌ది. ఒక్కో టీకా కేంద్రంలో రోజుకు 100 నుంచి 200 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని, వ్యాక్సిన్‌ తీసుకున్నవారిని 30 నిమిషాలపాటు పరిశీలనలో ఉంచాలని కేంద్రం సూచించింది. సాధ్యమైనంత వరకు ఒక జిల్లాకు ఒకే కంపెనీకి చెందిన టీకాను కేటాయించాల‌ని సూచించింది. ఒకే ప్రాంతంలో ప‌లు ర‌కాల వ్యాక్సిన్లవ‌ల్ల‌ గందరగోళం తలెత్తే ప్రమాదముందని కేంద్రం అభిప్రాయ‌ప‌డింది.

కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..

-టీకా పంపిణీ కోసం కేంద్రం Co-WIN వెబ్‌సైట్‌ను తీసుకురానుంది. ఇందులో ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

-టీకా తీసుకునే వ్యక్తి కేంద్రానికి వచ్చేంతవరకు వ్యాక్సిన్‌, డైల్యుయెంట్లను వ్యాక్సిన్‌ క్యారియర్‌లో జాగ్రత్తగా మూసి ఉంచి పరిరక్షించాలి.

-టీకా సెషన్‌ పూర్తయిన తర్వాత ఐస్‌ప్యాక్స్‌, ఓపెన్‌ చేయని వ్యాక్సిన్‌ వయల్స్ ఉన్న వ్యాక్సిన్‌ క్యారియర్‌ను తిరిగి కోల్డ్‌ స్టోరేజీ పాయింట్‌కు పంపించాలి.

-ఒక్కో వ్యాక్సినేషన్‌ బృందంలో ఐదుగురు సభ్యులు ఉండాలి. ఒక టీకా కేంద్రంలో రోజుకు 100 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ఒకవేళ వ్యాక్సిన్‌ కేంద్రం పెద్దగా ఉంటే మరో వ్యాక్సినేటర్ అధికారిని ఏర్పాటు చేసి 200 మందికి టీకా ఇవ్వొచ్చు.

-తొలి ప్రాధాన్యంలో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 50 ఏండ్ల‌ పైబడిన వారికి టీకా ఇవ్వాలి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి 50 ఏండ్ల‌ లోపువారికి అందించాలి. ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఓటర్ల జాబితా ఆధారంగా 50 ఏండ్లు పైబడిన వారిని గుర్తించాలి.

-వ్యాక్సిన్‌ వేసే గదిలోకి ఒక్కరినే అనుమతించాలి. టీకా తీసుకున్న తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని 30 నిమిషాల పాటు పరిశీలించాలి.

- Advertisement -