సెస్ పేరుతో ఎడాపెడా

52
- Advertisement -
  • సెస్ గుట్టును బయటపెట్టిన కాగ్
  • రూ.2,96,884 కోట్ల సెస్ ఆదాయం
  • ఇప్పటికీ 35 రకాల వస్తుసేవలపై సెస్
  • సెస్ నిధులన్నీ రిజర్వు ఫండ్స్లో కే?
  • దారిమళ్ళిన క్రూడ్ ఆయిల్ సెస్
  • విద్య, ఆరోగ్యం కోసం 5% సెస్
  • ఆరోగ్యానికి సెస్ నిధులివ్వని కేంద్రం
  • సెస్ వసూళ్ళ నిగ్గుతేల్చిన కాగ్

కేంద్ర ప్రభుత్వం ఖజానాను నింపుకోవడం కోసం అమలు చేస్తున్న పన్నుల విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి-కాగ్) నివేదికలు కూడా పన్నుల విధానంలో జరుగుతున్న తప్పలను ఎత్తిచూపిందని, ఆ కాగ్ నివేదికల ఆధారంగానే విమర్శకులు ధ్వజమెత్తుతున్నారని పలువురు ఆర్ధికవేత్తలు మండిపడుతున్నారు. ఓ వైపు దేశ ప్రజల నడ్డి విరుస్తున్న జి.ఎస్.టి. పనులకు అదనంగా సర్చార్జీల పేరుతో రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న కేంద్ర ప్రభుత్వం చివరకు సిస్ రూపంలో కూడా లక్షలాది కోట్ల రూపాయల నిధులను కేంద్రం వసూలు చేస్తోంది. ఏ లక్ష్యం కోసమైతే కేంద్రం సిస్ రూపంలో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుందో ఆ లక్ష్యానికి నిధులను ఖర్చు చేయకుండా దారిమళ్ళించి రిజర్వు ఫండ్స్ ఖాతాలోకి జమచేస్తోందని కాగ్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయని ఆర్ధికశాఖలోని పలువురు సీనియర్ అధికారులు వివరించారు.

2021వ సంవత్సరంలో సెస్ ల పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి 2,96,884 కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకొందని ఆ అధికారులు వివరించారు. అంటే రోజుకు సెస్ రూపంలో 813 కోట్ల రూపాయల నిధులను దేశ ప్రజలు కేంద్రానికి చెల్లిస్తున్నారు. అదే సెస్ రూపంలో 2014వ సంవత్సరంలో 73,880 కోట్ల రూపాయలను మాత్రమే అప్పటి ప్రభుత్వాలు వసూలు చేశాయి. జి.ఎస్.టి. పన్నులు, సర్చార్జీలకు అదనంగా సెస్ రూపంలోనూ పన్నులు వసూలు చేస్తున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి సెస్ రూపంలో పన్నులు వేసి వసూలు చేసుకోవచ్చు. ఇలా 35 రకాల వస్తు సేవలపై కనీసం నాలుగు నుంచి గరిష్టంగా అయిదు శాతం సెస్ రూపంలో అదనంగా పన్నులువేసి కేంద్రం వసూలు చేసుకుంటోంది. ఇలా వసూలు చేసుకొన్న నిధుల్లో రాష్ట్రాలకు ఒక్క రూపాయిని కూడా వాటాగా ఇవ్వాల్సిన అవసరంలేదని, మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వమే సంబంధిత అభివృద్ధి పనుల కోసం సెస్ నిధులను ఖర్చు చేయాల్సి వుంది.

ఈ రూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో పలు అభివృద్ధి పనుల కోసం అన్ని రకాల పన్నులకు అదనంగా సెస్ రూపంలో మరో 5 శాతం నిధులను దేశ ప్రజల నుంచి వసూలు చేస్తోంది. అలా దేశ ప్రజల నుంచి వసూలు చేసిన నిధుల్లో విద్యారంగానికి కొద్ది మేరకు నిధులను ఖర్చు చేసిన కేంద్రం వైద్య రంగానికి మాత్రం ఒక్క రూపాయిని కూడా ఖర్చు చేయలేదని కాగ్ నివేదికలే స్పష్టంచేస్తున్నాయని ఆ అధికారులు వివరించారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయనే సాకుతో 1,25,000 కోట్ల రూపాయల నిధులను దేశ ప్రజల నుంచి సెస్ రూపంలో వసూలు చేసిన కేంద్రం ఆ నిధులను ఆయిల్ కంపెనీల అభివృద్ధికి ఇవ్వలేదని, ఆ నిధులన్నింటినీ దారి మళ్ళించిందని కాగ్ నిష్కర్షగా కేంద్రం చర్యలను తప్పబట్టిందని, ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు నోరుమెదపడంలేదని ఆ అధికారులు వివరించారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ సాకుతో పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశమే హద్దుగా పెంచిన కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించడానికి సెస్ రూపంలో వసూలు చేసిన నిధులను ఖర్చు చేయాల్సి ఉందని, ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించడానికి ఖర్చు చేయాల్సింది పోయి ఆ నిధులను కూడా రిజర్వు ఫండ్స్ ఖాతాకు మళ్ళించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2018-19వ ఆర్ధిక సంవత్సరంలో 2.70 లక్షల కోట్ల రూపాయలను సెస్ రూపంలో వసూలు చేసిన కేంద్రం ఆ నిధుల్లో నుంచి ఒక లక్షా 64 వేల కోట్ల రూపాయల నిధులను మాత్రమే నిర్దేశించిన పనులకు ఖర్చు చేసిందని, మిగిలిన ఒక లక్షా ఆరు వేల కోట్ల రూపాయల నిధులను దారిమళ్ళించారని కాగ్ నిగ్గుతేల్చిందని ఆ అధికారులు వివరించారు. ఇలా దేశ ప్రజల నుంచి ఎడాపెడా సెస్ రూపంలో లక్షల కోట్ల రూపాయల నిధులను వసూలు చేసుకొంటున్న కేంద్ర ప్రభుత్వం ఏ లక్ష్యం కోసం ఈ నిధులను వసూలు చేస్తుందో ఆయా లక్ష్యాలను నెరవేర్చడానికి ఖర్చు చేయకుండా నిధులన్నింటినీ దారిమళ్ళించి రిజర్వు ఫండ్స్ గా ఖజానాలో ఉంచుకుంటోందని స్పష్టమయ్యిందని వివరించారు.

ఎగుమతులపైనా సెస్ విధిస్తున్నారని, రోడ్లు-జాతీయ రహదారులు, జాతీయ వివత్తుల సహాయ నిధుల కోసం పొగాకు ఉత్పత్తులపైన, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సెస్ రూపంలో నాలుగు శాతం నిధులను వసూలు చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలపైన సెస్, జి.ఎస్.టి పరిహారం కోసం సెస్ను వసూలు చేస్తున్నట్లుగా అధికారికంగా జాబితాలో చేర్చిన కేంద్రం మరో 35 రంగాలపైన కూడా సెస్ రూపంలో అదనపు పన్నులు వసూలు చేస్తున్నట్లుగా కాగ్ తేల్చిందని ఆ అధికారులు వివరించారు. ఆటోమోబైల్స్, ఎయిర్ కండిషనర్లు, బొగ్గు, కూల్డ్రింక్స్, సిగరెట్లు, పాన్ మసాలా వంటి 35 రంగాలపైన కూడా సెస్ను వసూలు చేస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే జి.ఎస్.టి. పనుల జాబితాలోని 28 శాతం మేరకు పన్నులు వసూలు చేసే స్లాబుల్లోకి వచ్చే అన్ని రకాల వస్తు సేవలపైన సెస్ రూపంలో అదనంగా నాలుగు శాతం పన్నులను వసూలు చేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు కనుకనే ఒక్క ఏడాదిలోనే రికార్డుస్థాయిలో 2,96,884 కోట్ల రూపాయల ఆదాయం కేంద్ర ఖజానాకు వచ్చిందని వివరించారు. ఇలా లక్షాది కోట్ల రూపాయల నిధులను సెస్ రూపంలో వసూలు చేసుకొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇలా 2026వ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకూ సెస్ వసూళ్ళను కొనసాగించుకునే విధంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గత జూన్ నెల 30తో ముగిసిన సెస్ వసూళ్ళ గడువును కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా మరో నాలుగేళ్ళపాటు పెంచుకొందని వివరించారు.

ఇవి కూడా చదవండి…

పవన్ తో ముప్పు.. ఎవరికి ?

క్రిస్మస్ విందుకు హాజరుకానున్న సీఎం…

మీ ఆశీస్సులే సీఎంకు శ్రీరామరక్ష…

- Advertisement -