ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం :నాగేశ్వర్‌

110
exmlc
- Advertisement -

ప్రముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వ‌ర్ కేంద్ర ప్ర‌భుత్వ వివ‌క్ష‌ను ఎండ‌గ‌ట్టారు. కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో అత్య‌ధిక ప‌త‌కాలు సాధించిన తెలంగాణ‌కేమో నిధులు త‌క్కువగా కేటాయించడం… అస‌లు ప‌త‌కాలే తీసుకురాలేని గుజ‌రాత్‌కేమో దేశంలోనే అత్య‌ధికంగా నిధులు కేటాయించార‌ని ఆయ‌న దుయ్యబట్టారు.

కేంద్ర ప్ర‌భుత్వ నిధుల పంపిణీలో ఫెడ‌ర‌ల్ స్ఫూర్తిని కాలరాస్తుందన్నారు. రాష్ట్రాల ప‌ట్ల ఎలాంటి ప‌క్ష‌పాతం చూపెట్ట‌కూడదన్నారు. అలాంటిది కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమప్రాధాన్యం ఇవ్వాలి కానీ నిధుల విషయంలో వివక్షతను చూపిస్తున్నారని మండిపడ్డారు. క్రీడా మంత్రిత్వ శాఖ‌లో గ‌ణ‌నీయ‌మైన నిధులు ఖేలో ఇండియాకు ఇచ్చారు. ఖేలో ఇండియా కింద తెలంగాణ‌కు రూ. 24 కోట్లు కేటాయించారు. కానీ గుజ‌రాత్‌కు మాత్రం రూ. 608 కోట్లు కేటాయించారు. గుజ‌రాత్‌కు కేటాయించిన నిధులతో పోల్చితే తెలంగాణ‌కు కేటాయించింది కేవ‌లం 4 శాతం మాత్ర‌మే అన్నారు.

తెలంగాణ‌కు రూ. 24 కోట్లు, ఏపీకి రూ. 34 కోట్లు, త‌మిళ‌నాడుకు రూ. 33 కోట్లు, కేర‌ళ‌కు రూ. 62 కోట్లు కేటాయించారు. సౌత్ ఇండియాలో బీజేపీ పాలించ‌ని ఈ రాష్ట్రాల‌కు మొత్తంగా రూ. 154 కోట్లు కేటాయించి…. బీజేపీ పాలిత రాష్ట్రం క‌ర్ణాట‌కకు రూ. 128 కోట్లు కేటాయించుకున్నారు. మొత్తం క‌ర్ణాట‌క‌తో స‌హా ఐదు ద‌క్షిణ రాష్ట్రాల‌ను చూస్తే రూ. 280 కోట్ల‌కు పైగా కేటాయించారు. ఉత్త‌రాది రాష్ట్రాలైన గుజ‌రాత్‌కు రూ. 608 కోట్లు, యూపీకి రూ. 500 కోట్ల‌కు పైగా కేటాయించారు. ఒక్క గుజ‌రాత్‌కే అన్ని నిధులు ఎందుకుకేటాయించారో స‌మాధానం లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజ‌స్థాన్‌కు రూ. 110 కోట్లు, మ‌హారాష్ట్ర‌కు రూ. 111 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకున్న‌ప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు పెద్ద‌పీట‌, అందులో మోదీ, అమిత్ షా స్వ‌రాష్ట్రానికి ఇంకా పెద్ద‌పీట వేశారన్నారు. నార్త్ ఇండియన్ స్టేట్స్‌కు ఒక ర‌క‌మైన నిధులు కేటాయిస్తే, సౌత్ ఇండియ‌న్ స్టేట్స్‌కు మ‌రో ర‌కంగా నిధులు కేటాయించి ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగేలా చేస్తూ…. నిధుల కేటాయింపులో వివ‌క్ష‌త చూపిస్తే దేశ స‌మైక్య‌త‌, స‌మ్ర‌గ‌త‌కు ప్ర‌మాదం క‌లుగుతుంద‌ని నాగేశ్వ‌ర్ పేర్కొన్నారు.

- Advertisement -