టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. భారతీయ సినీ రంగంలో చెరగని ముద్రవేశారు. ఆయన మృతితో సినీరంగం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం,మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు అని కొనియాడారు.
కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు అన్నారు ఎన్టీఆర్. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం అన్నారు.
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన సూపర్స్టార్ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు పవన్ కళ్యాణ్. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందన్నారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు అన్నారు.
సినిమా రంగానికి కృష్ణ చేసిన సేవలు అజరామరం అన్నారు మంత్రి కేటీఆర్. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వెండి తెరపై “సూపర్ స్టార్” గా వెలుగొందిన హీరో కృష్ణ గారి మృతి బాధాకరం. ఒక సామాన్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, ఒక సినీ శక్తిగా మారి, పరిశ్రమలో “సూపర్ స్టార్ ” గా ఎదిగిన కృష్ణ గారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను అన్నారు మంత్రి హరీశ్.
కృష్ణ మరణం యావత్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వాట్ ఎ లెజెండ్. RIP #SuperStarKrishna గారూ! మహేష్ & కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను అని తెలిపారు రవితేజ . కృష్ణ మరణం సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరని లోటు అన్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
ఇవి కూడా చదవండి..