వారిద్దరు ప్రేమించుకున్నారు.. కలకలం తోడునీడుగా కలిసి జీవించాలనుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటికావాలనుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో చివరకు ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ కాలం వీరిపట్ల పగబట్టింది. కాళ్ల పారాని ఆరకముందే నవ వధువు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తోడబుట్టిన అన్ననే తన చెల్లిని కత్తితో పొడిచి కాటికిపంపాలనుకున్నాడు. దీనికి కారణం ఆ యువతి పెద్దలు వద్దంటున్నా కులాంతర వివాహం చేసుకోవడమే. ఈ విషాధకరమైన ఘటన సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్‌లో చోటుచేసుకుంది. చిట్టంపల్లి మౌనిక అనే యువతి తన సహా విద్యార్థి సొల్లు సాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వీరి ప్రేమకు అడ్డుచెప్పారు. కులాలు వేరు కావడంతో మౌనిక తల్లితండ్రులు పెండ్లికి అంగీకరించలేదు. దీంతో మౌనిక సాయిలు ఇద్దరు ఆర్య సమాజ్‌లో హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో పెండ్లి చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత యువతి తల్లి ఆ యువతిని తిరిగి ఇంటికి రావాలని కోరడంతో తమ పెళ్లి పట్ల పెద్దలు సుముఖత వ్యక్తం చేశారని, తిరిగి తమని ఆశీర్వదిస్తారని నమ్మిన మౌనిక తిరిగి తల్లిగారింటికి వెళ్లింది. కానీ ఆ యువతి ఆశలు అడియాసలే అయ్యాయి. తల్లిగారింటికి వెళ్లింది మొదలు ఆ యువతిని గృహనిర్భందం చేశారు పుట్టింటివారు.
దీంతో తన భార్యను తన దగ్గరికి పంపించాలంటూ ఆ యువకుడు సాయి బెజ్జంకి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నారు. పోలీసులు కౌన్సిలింగ్‌కు రమ్మన్నారని తెలుసుకున్న మౌనిక స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమె అన్న తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా మానవత్వం మరిచి ఆమెపై కత్తితో దాడి తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగకుండా వీపులో పొడిచి కత్తిని అలాగే వదిలేసి పారిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన మౌనిక రక్తపు మడుగులో పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మౌనికకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.