మహిళా రిజర్వేషన్ చట్టంలో మార్పులు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. దీనితో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో రెండు బిల్లులు— నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
మహిళా రిజర్వేషన్ చట్టం గనుక ఆమోదం పొంది ఉంటే, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో దానిని అమలు చేయడానికి ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు’ అవసరమయ్యేది. కానీ ప్రధానమైన రాజ్యాంగ సవరణ బిల్లే వీగిపోవడంతో, మిగిలిన రెండు బిల్లులతో ముందుకు వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారాలంటే సభకు హాజరైన వారిలో రెండొంతుల (2/3) మెజారిటీ అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే (NDA) బలం ఆ స్థాయికి చేరుకోలేదు.
బిల్లుకు అనుకూలంగా: 298 ఓట్లు
బిల్లుకు వ్యతిరేకంగా: 230 ఓట్లు
ఎన్డీయే బలం: 293 మంది సభ్యులు (సభలో 54%)
ప్రతిపక్షాల బలం: 233 మంది సభ్యులు
ఎన్డీయేకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు కావాల్సిన సంఖ్య లేకపోవడంతో బిల్లు ఆగిపోయింది.
ఈ ప్రత్యేక మూడు రోజుల పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ చట్టం) కింద 2029 నాటికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం…లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచాలని ప్రతిపాదించింది.
గతంలో ప్రచురించిన జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి, 2029 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలని భావించింది.ప్రతిపక్షాలు మొదటి నుండి ఈ సవరణలను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘డీలిమిటేషన్ బిల్లు’పై అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒడిశా రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలకు ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల ముప్పు పొంచి ఉందని బిజూ జనతా దళ్ (BJD) చీఫ్ నవీన్ పట్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా ఎంపీలందరూ దీనిపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read:KTR:పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా
ఓటింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తే ఆ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని, కానీ అందరూ మద్దతు ఇస్తే ఆ క్రెడిట్‌ను అందరికీ పంచుతానని, అందరికీ ‘బ్లాంక్ చెక్’ ఇవ్వడానికి తాను సిద్ధమని భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాల మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది.

