లెబనాన్‌పై దాడులు..ఇజ్రాయెల్‌కు ట్రంప్!

11
- Advertisement -

ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే, ఇరాన్ తన వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచినట్లు ప్రకటించింది. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో వరుస పోస్ట్‌లతో హోరెత్తించారు.

ట్రంప్ తన మొదటి పోస్ట్‌లో, “హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంది. ఇరాన్ అక్కడ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను (Sea Mines) అమెరికా సహాయంతో తొలగిస్తోంది” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్ముజ్ జలసంధిని ప్రపంచ దేశాలపై ఆయుధంగా వాడబోమని ఇరాన్ అంగీకరించిందని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్‌తో జరగాల్సిన ‘లావాదేవీలు’ 100% పూర్తయ్యే వరకు అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

లెబనాన్ విషయంలో ట్రంప్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. “లెబనాన్‌పై దాడులు చేయకూడదని ఇజ్రాయెల్‌ను అమెరికా నిషేధించింది. ఇకపై ఇజ్రాయెల్ అక్కడ బాంబులు వేయదు. హిజ్బుల్లా వ్యవహారాన్ని అమెరికా ప్రత్యేకంగా, సరైన రీతిలో పరిష్కరిస్తుంది” అని ఆయన రాసుకొచ్చారు. “ఇక చాలు!” అంటూ ఇజ్రాయెల్‌కు గట్టి సందేశం పంపారు.

ఈ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన దేశాలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లను “అద్భుతమైన వ్యక్తులు” అని కొనియాడారు. పాకిస్థాన్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ (UAE), ఖతార్ దేశాల సహాయాన్ని మరియు ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.

ఉత్తర అట్లాంటిక్ సంధి సంస్థ (NATO) పై ట్రంప్ తన విమర్శనాస్త్రాన్ని మళ్ళీ ఎక్కుపెట్టారు. “హార్ముజ్ జలసంధి సమస్య తీరిపోయిన తర్వాత నాటో నుండి నాకు ఫోన్ వచ్చింది.. సహాయం ఏమైనా కావాలా అని? అవసరమైనప్పుడు వారు ఏమీ చేయలేకపోయారు. నాటో ఒక ‘పేపర్ టైగర్’ (కాగితపు పులి). మాకు దూరంగా ఉండండి” అని ఘాటుగా సమాధానమిచ్చారు.

Also Read:KTR:పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా

అణు కేంద్రాల విధ్వంసంపై గుర్తు చేస్తూ..గతేడాది జూన్‌లో అమెరికా బి-2 (B2) బాంబర్ల ద్వారా ఇరాన్ అణు కేంద్రాలపై జరిపిన దాడులను గుర్తు చేస్తూ, ఇరాన్ వద్ద ఉన్న అణు ‘దుమ్ము’ (Nuclear Dust) మొత్తాన్ని అమెరికా వశం చేసుకుంటుందని, ఈ ఒప్పందంలో భాగంగా ఎలాంటి నగదు మార్పిడి జరగదని ట్రంప్ స్పష్టం చేశారు.

- Advertisement -