KTR:పేద విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా

13
- Advertisement -

పేద విద్యార్థినుల విద్యా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న ‘టచ్ ఏ లైఫ్’ (Touch A Life) ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ నంది నగర్‌లోని కె.టి. రామారావు (కేటీఆర్) నివాసంలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం జరిగింది. మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సారధ్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా విద్యార్థినులతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడిన కేటీఆర్, వారి విద్యా ప్రగతిని అడిగి తెలుసుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినుల డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు మరియు వారి అకడమిక్ వృద్ధికి మద్దతుగా కేటీఆర్ స్వయంగా లాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని ఆయన హితబోధ చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ పంపిణీ చేసిన లాప్‌టాప్‌లను అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా మరియు కర్రె ఆర్తి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్ మరియు రీనా హిందోచా మాట్లాడుతూ,తెలంగాణవ్యాప్తంగా బస్తీలు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్‌షిప్‌లు, మెంటార్‌షిప్ మరియు నిరంతర మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే తమ లక్ష్యమని వివరించారు.

ఫౌండేషన్ చేస్తున్న ఈ క్షేత్రస్థాయి కృషిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సమగ్ర సమాజ నిర్మాణంలో ఇటువంటి సంస్థల పాత్ర మరువలేనిదని, భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బాలికల విద్య మరియు సాధికారతకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థిని చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో గొప్పదన్నారు. త్వరలో మరోసారి ఫౌండేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం సమన్వయం చేసిన మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమను అభినందించారు.

also read:కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

ఈ సమావేశం విద్యార్థినులలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని, తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.

- Advertisement -