గణేష్ ఉత్సవాలు విజయవంతానికి కృషి– రామ్మోహన్‌

477
bonthu rammohan
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత వైభవోపేతంగా జరిగే గణేష్ ఉత్సవాలను, నిమజ్జనాన్ని ఏవిధమైన సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో పనిచేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నగరంలో గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై జిహెచ్ఎంసి కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమిక్షసమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ కమిషనర్లు అనిల్ కుమార్, చౌహాన్ లు, గణేష్ ఉత్సవ కమిటి ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణ ప్రతి సంవత్సరం విజయవంతంగా జరుపుతున్నప్పటికీ ప్రతి సారి కొత్త అంశాలతో ఏర్పాటు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అదనపు సిబ్బంది ఏర్పాటు, మౌలిక సదుపాయల కల్పనతో పాటు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఏవిధమైన తప్పుడు ప్రచారాలు జరిగినా వాటిని నమ్మవద్దని, పైగా వాటిని పంపేవారి సమాచారాన్ని అధికారులకు అందించాలని రామ్మోహన్ పేర్కొన్నారు.

జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనం సాఫీగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామని, దీనిలో భాగంగా 254 క్రేన్ లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు నగరంలోని అన్ని గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సారి 30 శాతం అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలియజేశారు. రూ.8.24 కోట్ల వ్యయంతో క్రేన్ లు, వాహనాలు, రూ.9.20 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, నిమజ్జన చెరువుల క్లీనింగ్ తదితర ఏర్పాట్లను చేపడుతున్నామని పేర్కొన్నారు.

గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో పారిశుధ్య నిర్వహణకుగాను గణేష్ యాక్షన్ టీమ్ లను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని, నిమజ్జన ప్రాంతాల్లో స్ర్పేయింగ్, ఫాగింగ్ లను చేపడుతామని పేర్కొన్నారు. దాదాపు కోటి రూపాయల వ్యయంతో 36,674 అదనపు లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నామని, 191 సిబ్బందితో కూడిన 115 బృందాలతో నిరంతర లైటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా 115 ప్రత్యేక క్యాంపుల ద్వారా 30.52 లక్షల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్టు జలమండలి అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం 40వేల విగ్రహాలను ప్రతిష్టించారని, ఈ సారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 20వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఐదు కంపెనీల సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు శాంతి భద్రతల పరిరక్షణకు నియమించనున్నట్టు తెలిపారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు గాను ఆన్ లైన్ ద్వారా అనుమతులు పొందాలని, దరఖాస్తుచేసిన ప్రతివిగ్రహానికి క్యూ.ఆర్ కోడ్ ను జారీచేయనున్నట్టు అంజనీకుమార్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత సంవత్సరం 11వేల విగ్రహాల ప్రతిష్టాపన జరిగిందని, ఈ సారి కూడా ఇదే సంఖ్యలో విగ్రహాల ఏర్పాటుకు తగు బందోబస్తు చర్యలను చేపట్టామని రాచకొండ పోలీస్ అధికారులు తెలిపారు.

- Advertisement -