బాలీవుడ్ అహంకారాన్ని బాహుబలి ఎంతగా దెబ్బ కొట్టిందంటే విడుదలైన పది రోజుల తర్వాత కూడా బాలీవుడ్ చిత్రరంగ ప్రముఖులు నోట మాట రాలేదు. తమ సినిమాలు, సహచర నటుల సినిమాలు, అవార్డులు వచ్చినప్పుడు విపరీతంగా స్పందించే బాలీవుడ్ ప్రముఖులు బాహుబలిపై అస్సలు స్పందించలేదు. ప్రియాంక చోప్రా, రిషి కపూర్ కొందరు హిందీ ప్రముఖులు తప్ప….. పెద్ద హీరోలైన ఖాన్ త్రయం ఆమిర్, షారుక్, సల్మాన్‌లు స్పందించకపోగా.. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ వంటి హీరోలు కూడా నోరెత్తడం లేదు. వరుణ్ ధావన్, కరణ్ జోహార్, శేఖర్ కపూర్ వంటి ప్రముఖులు మాత్రం బాహుబలిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ రికార్డులన్నీ తునాతునకలు చేసిన మన సినిమాను చూసి వారంతా ఈర్ష్య పడుతున్నారని అందుకే ఎవరూ స్పందించడం లేదని అంటున్నారు.
బాహుబలి సినిమా విషయంలో సైలెంట్‌గా ఉంటున్న బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని పశ్నించాడు రచయిత కోన వెంకట్. మౌనం ఎందుకు అని ప్రశ్నించాడు. పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీయార్ వంటి టాలీవుడ్ అగ్ర తారలు బాహుబలి: ది కంక్లూజన్ సినిమాను చూసి అభినందించడం నాకు నిజంగా ఆనందం కలిగింది. ఇదే పనిని బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్‌ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎందుకు చేయలేకపోతున్నారు. వారు ఇప్పటికీ మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారు అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. అలాగే ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా విడుదలైనపుడు ఇక్కడి టాప్‌స్టార్ స్పందించిన విషయాన్ని గుర్తు చేశాడు.
మరోవైపు విజయేంద్ర ప్రసాద్ అందించిన భజరంగీ భాయీజాన్ కథకు డైరెక్టర్‌గా వ్యవహరించిన డైరెక్టర్ కబీర్ ఖాన్ బాహుబలి 2పై స్పందించాడు. బాహుబలి తెలుగు సినిమా కాదని, అది ఇండియన్ సినిమా అని పొగడ్తల వర్షం కురిపించాడు. బాహుబలి విజయం తనకు ఎంతో బలాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. రాజమౌళి బృందం పనితీరుకు తాను ఫిదా అయిపోయానని చెప్పాడు. ఓ ప్రాంతీయ సినిమా భాషా ఎల్లలను చెరిపేసిందని, అందుకు తాను సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఎక్కడైనా ఓ మంచి సినిమా విజయం సాధిస్తే తాను చాలా ఆనందిస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కబీర్ ఖాన్ సల్మాన్ ఖాన్‌తో ట్యూబ్ లైట్ చిత్రాన్ని చేస్తున్నాడు. హాలీవుడ్ మూవీ లిటిల్ బాయ్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా జూన్ 23న విడుదల కాబోతోంది.
‘బాహుబలి: ది కన్ క్లూజన్’ చిత్రాన్ని వీక్షించిన వెటరన్ బాలీవుడ్ యాక్టర్ రిషి కపూర్ కూడా బాహుబలిని ఆకాశానికెత్తేశాడు. బాహుబలి 2 రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు.ఆదివారం సాయంత్రం సినిమాకు వెళ్లిన ఆయన, ఇంటర్వెల్ సమయంలో ఓ ట్వీట్ పెడుతూ, “బాహుబలి-2ను ఇప్పుడు చూస్తున్నాను. విశ్రాంతి పడింది. సినిమా గురించి మళ్లీ మాట్లాడతాను. ఈ సినిమా ఎక్కడ షూట్ చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నా. అక్కడ నాకో 2 బెడ్ రూం ఫ్లాట్ కావాలి. ఎవరైనా ఏజంట్ ఉన్నారా?” అని ట్వీట్ చేశారు. ఆపై రాత్రి సినిమా చూసిన తరువాత ట్వీట్ పెడుతూ, భారత సినిమా రంగానికి పండగొచ్చిందని, ఈ సినిమా వసూళ్లను చేరేందుకు మిగతా హీరోలు ఎంతో కృషి చేయాల్సి వుంటుందని అన్నారు.
మరో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కునాల్ కోహ్లీ.. రియాల్టీ షోల్లో తమ సినిమాలు ప్రమోట్ చేసుకునే బాలీవుడ్ స్టార్లపై మండి పడ్డారు. బాహుబలి స్టార్లు.. ఎలాంటి రియాల్టీ షోలకు వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకోలేదన్నారు. సిల్లీ పనులు చేయలేదన్నారు. సిల్లీ ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పలేదన్నారు. పెద్ద బడ్జెట్ మూవీలంటూ చెప్పుకునే బాలీవుడ్ స్టార్లకు బాహుబలి సినిమా ఒక చెంపపెట్టు లాంటిదన్నారు.