హైకోర్టు తీర్పు..కాంగ్రెస్‌కు చెంపపెట్టు

6
- Advertisement -

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్వాగతించింది. గతంలో దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చడం ప్రజాస్వామ్య పరిరక్షణకు దక్కిన విజయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరికి ఈ తీర్పు ఒక కోలుకోలేని చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

ఫిరాయింపులకు గురైన మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా వెంటనే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నిజమైన నమ్మకం ఉంటే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా, వెంటనే రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు.

Also Read:దానం నాగేందర్‌పై అనర్హత వేటు

ఈ వ్యవహారంలో నాగేందర్ లేదా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున, తమ వాదన వినకుండా ఎలాంటి ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వకుండా చూడాలని కోరుతూ శనివారమే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -