ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. 2024 ఏప్రిల్ 23వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో దానం నాగేందర్ అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.
తీర్పు వెలువడిన వెంటనే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, ఆలోపు కనీసం ఒక గంట సమయం పాటు ఈ తీర్పును సస్పెండ్ చేస్తూ స్టే ఇవ్వాలని కోరారు. అయితే, దానం నాగేందర్ న్యాయవాదుల విజ్ఞప్తిని హైకోర్టు తేల్చిచెప్పి తిరస్కరించింది. ఎలాంటి స్టే ఇచ్చేందుకు సుముఖత చూపలేదు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదని పిటిషనర్ల తరఫు, బీఆర్ఎస్ న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం స్పష్టమైన ఉల్లంఘన జరిగిందని, ఈ తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించే అవకాశం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరొక పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్, బిజెపి నాయకులు స్పీకర్‌తో పాటు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తుది తీర్పు వెలువరించింది.
Also Read:రేవంత్‌పై హరీష్ రావు సెటైర్లు

