బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇకలేరు..

281
Baddam Bal Reddy
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి ఇకలేరు. బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు బాల్ రెడ్డి.

2దశాబ్దాల క్రితం ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన నాయకులలో ఒకరు బద్దం బాల్‌రెడ్డి. ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి బీజేపీ అధిష్టానం పరిశీలించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు.

బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా జీవితంలో బాల్‌రెడ్డి చేసిన సేవలను సీఎం ఈసందర్భంగా కొనియాడారు. ఇక ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు.

రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని తన స్వగృహంలో ఉంచనున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యకర్తల కడచూపు కోసం బీజేపీ కార్యాలయంలో సాయంత్రం వరకు బాల్ రెడ్డి భౌతికకాయాన్ని ఉంచుతారు. బీజేపీ కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం మహాప్రస్థానంలో బాల్ రెడ్డి అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు.

- Advertisement -