బిజెపిలో మూడు ముక్కలాట

232
- Advertisement -

మూడు గ్రూపులుగా టి.బిజెపి నేతల ఫైట్

ఎవరికి వారే యమునా తీరే

వ్యక్తిగత ఇమేజ్ లకే ప్రాధాన్యత

బండి సంజయ్ రూటే సపరేటు

సీఎం అభ్యర్ధిగా కిషన్ రెడ్డి ప్రచారం

ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం

పటిష్టమైన సిద్ధాంతాలు, నిఖార్సయిన క్రమశిక్షణ, రాజీపడని రాజకీయ ఎత్తుగడలో ఒక వెలుగు వెలిగిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేడు గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బిజెపిలో గ్రూపు రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని, క్రమశిక్షణ పూర్తిగా మంటగలిసిందని పలువురు సీనియర్ నాయకులు మదనపడుతున్నారు. ఈ పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే కిందిస్థాయి కేడర్ ముందుకు ఒకరిపై మరొకరు నిందించుకునే స్థాయికి నేతలు దిగజారారని అంటున్నారు. ఈ గ్రూపుల రాజకీయాలు, కొట్లాటల మూలంగానే మునుగోడు అసెంబ్లీ ఉప ఎనికల్లో పార్టీ ఓటమికి కూడా కారణమయ్యాయని కొందరు సీనియర్ నాయకులు విశ్లేసిస్తున్నారు.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ది ఒక గ్రూపు అయితే కేంద్రమంతి జి.కిషన్ రెడ్డిది మరొక గ్రూపు అని, ఇక ఇటీవలనే పార్టీలో చేరి జాతీయస్థాయి నేతల దృష్టిని ఆకర్షించిన మాజీ మంత్రి ఈట రాజేందర్ ది మరోక గ్రూపుగా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ది ఒంటెద్దు పోకడని, రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో అగ్రనేతల దృష్టిని ఆకర్షించడానికి, రాష్ట్రంలో తనకు తిరుగులేదని నిరూపించుకునేందుకు, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందకే తాపత్రయపడుతుంటాడని, అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇతర జిల్లాల్లో పాదయాత్రలు చేస్తూ కాలం గడిపారని అంటున్నారు. చివరకు బిజెపి అధిష్టానం చివాట్లు పెట్టడంతోనే పాదయాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేసి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, అది కూడా మొక్కుబడిగానే సాగిందని అంటున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షాల వద్ద తన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకొని వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలనే లక్ష్యంతో బండి సంజయ్ పనిచేస్తున్నారని వివరించారు. అదే విధంగా కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి కూడా రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని తన అనుచరులతో పార్టీలో అంతర్గత ప్రచారం చేయించుకొంటున్నారని, అందుకే బండి సంజయ్ తో ఎక్కడా సఖ్యతతో మెలగడం లేదని తెలిపారు.

బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరూ తూర్పూ-పడమరలుగా పార్టీలో వ్యవహరిస్తున్నారని, పార్టీలో అంతర్గతంగా జరిగే వ్యవహారాల్లో బండి సంజయ్ ను చులకన చేసే ప్రయత్నాలు చేస్తుంటారని, బండి సంజయ్ కు తగినంత చదువు లేదని, అంశాలపై బండికి విషయ పరిజ్ఞానం లేదని, బండికి అవగాహనా రాహిత్యం ఎక్కువని కిషన్ రెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తున్నారని వివరించారు.

అదే విధంగా కిషన్ రెడ్డిపైన బండి సంజయ్ వర్గీయులు వేరే విధంగా ప్రచారం చేస్తున్నారని, పార్టీ అంతర్గత విషయాలనీ టి.ఆర్.ఎస్.పార్టీ పెద్దలకు చేరవేస్తుంటాడని, ముఖ్యమంత్రి కె.సి.ఆర్.తో కిషన్ రెడ్డికి మంచి అండర్ స్టాండింగ్ ఉందని, కిషన్ రెడ్డి చెప్పిన పైరవీలనీ ఏం చేస్తుంటాడని కూడా ప్రచారం చేయడమే కాకుండా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలకు కూడా ఫిర్యాదులు వెళ్ళాయనే విమర్శలు కూడా ఉన్నాయని తెలిపారు.

కిషన్ రెడ్డి కూడా ముందుగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదని, అధిష్టానం అక్షింతలు వేసిన తర్వాతనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఆ ప్రచారాన్ని కూడా చిత్తశుద్ధితో చేయలేదని, కేవలం మొక్కుబడిగా చేసి చేతులు దులుపుకున్నారని అంటున్నారు. ఇందులో ఈటల రాజేందర్ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, ఆయన పార్టీలో ఒంటరి పోరాటం చేస్తున్నారని, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈటలను పట్టించుకునే నాధుడే లేడని అంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించడంతో ఆయన శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ గ్రూపు రాజకీయాల మూలంగా అధ్యక్షుడు బండి సంజయ్ గానీ, కేంద్ర మంతి కిషన్ రెడ్డిలు తనకు సంపూర్ణంగా సహకరించకపోవడంతో ఈటల రాజేందర్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యారని అంటున్నారు. అంతేగాక ఈ ఇద్దరు నాయకుల తీరుపై ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం సమయంలోనే కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేసినట్లుగా పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఈటల ఫిర్యాదులతోనే కమలం పార్టీ అధిష్టానం బండి సంజయ్, కిషన్ రెడ్డిలను మందలించినట్లుగా చెబుతున్నారు. అంతేగాక ఈటల రాజేందరకున్న స్పీడుతో, రాజకీయ అనుభవాలు, రాజకీయ వ్యూహ రచనలు చేయడంలో దిట్టని, రానున్న రోజుల్లో అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశ్యంతోనే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సహాయనిరాకరణను పాటిస్తున్నారనే విమర్శలున్నాయి.

వాస్తవానికి బండికి, కిషన్ రెడ్డిలకు పడదని, కానీ ఈటల రాజేందర్ విషయానికొచ్చేసరికి ఈ ఇద్దరు నేతలు ఏకమవుతూ ఈటలను ఏకాకిని చేస్తున్నారని, ఈ పరిణామాలు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టాలు కలిగిస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి విజయాలు సాధిస్తుందా ? లేదా? అనేది ప్రశ్నార్ధంగా మారిందని వాపోతున్నారు.

అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకొని పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు చరమ గీతం పాడుతారా..? లేదో…? వేచి చూడాలని అని ఆ సీనియర్ నాయకులు గంపెడాశతో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

కోమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన శాస్త్రి

బీఆర్ఎస్‌పై బహిరంగ ప్రకటన..

మునుగోడుతో మతరాజకీయాలకు చెక్..

- Advertisement -