Kejriwal:కేజ్రీవాల్ కు బీజేపీ ఆహ్వానం?

30
- Advertisement -

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న బీజేపీ మూడోసారి అధికారం కోసం గట్టిగానే కసరత్తులు చేస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా నరేంద్ర మోడీ మేనియాతోనే గెలవాలని చూస్తోంది. అయితే ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించేలా బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం కేవలం సొంత పార్టీ బలంతో పాటు ప్రత్యర్థి పార్టీలను బలహీన పరచడం కూడా ముఖ్యమే. అందులో భాగంగానే ఎన్డీయేకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఇండియా కూటమిని పూర్తిగా బలహీన పరిచేలా కమలం పెద్దలు వ్యూహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి ఏర్పడిన మొదటి నుంచి ఆ కూటమి నిలవదని బీజేపీ పెద్దలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం వారి మాటలే నిజమయ్యేలా ఇండియా కూటమి అస్తవ్యస్తంగా మారింది. .

ఇండియా కూటమిలో కీలకంగా ఉంటూ వచ్చిన బిహార్ సి‌ఎం నితిశ్ కుమార్ అనూహ్యంగా ఎన్డీయేతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. నితిశ్ ఎన్డీయేలో చేరడానికి మోడీ-షా వ్యూహరచనే కారణమనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక ఇప్పుడు ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న మరో పార్టీ ఆమ్ ఆద్మీ ని కూడా ఎన్డీయేలో చేర్చుకునే వ్యూహాలను మొదలు పెట్టినట్లు వినికిడి. గత కొన్నాళ్లుగా కేజ్రీవాల్ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తో విభేదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను నితిశ్ కుమార్ మాదిరి ఎన్డీయేలో చేర్చుకుంటే ఇండియా కూటమి పూర్తిగా బలహీన పడుతుందని భావిస్తున్నారట కమలనాథులు. తనకు ఎన్డీయే నుంచి ఆహ్వానం అందుతోందని స్వయంగా కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించడం ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే కాషాయ పార్టీకి తాము ఎప్పటికీ లోంగేది లేదని కేజ్రీవాల్ స్పస్టతనిచ్చారు. అయితే గతంలో నితిశ్ కుమార్ కూడా ఇదే విధంగా చెబుతూ చివరికి ఎన్డీయేతో చేతులు కలిపారు. ఇప్పుడు అదేవిధంగా కేజ్రీవాల్ కూడా బీజేపీ చెంతకు చేరుతారా ? లేదా ఇండియా కూటమిలోనే ఉంటారా ? అనేది చూడాలి.

Also Read:వేపాకు వల్ల నష్టాలు కూడా ఉన్నాయా?

- Advertisement -