శనివారం మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ, మహబూబాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతు వేదికలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బిందు, కలెక్టర్ గౌతం, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి దుయ్యబట్టారు. ‘నూతన వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టేలా ఉన్నాయి. అందుకే లక్షల మంది ఢిల్లీని ముట్టడించి ఉద్యమం చేస్తున్నారు. కొత్త చట్టాల్లో కనీస మద్దతు ధరకు తిలోదకాలు ఇచ్చింది.
పంజాబ్, హర్యానాలకే రైతుల ఉద్యమం పరిమితం కాలేదు. తెలంగాణలోనూ ఉద్యమం కొనసాగుతుంది. కేంద్రం నల్లచట్టాలను వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక గోదాంల సామర్థ్యాన్ని 60 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాం. రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు’ అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.