మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మొన్న బిక్షమయ్య గౌడ్, స్వామి గౌడ్, శ్రవణ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. రాపోలు వెంట పలువురు పద్మశాలీ సంఘం నాయకులు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాపోలు ఆనందభాస్కర్‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాపోలు సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్త అని కొనియాడారు. చేనేత, పవర్‌లూమ్ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ పలు పథాకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమేనని ఆయన పేర్కొన్నారు.
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దేశంలో చాలామంది అద్భుత ప్రతిభ ఉన్న చేనేత కళాకారులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. నేతన్నకు బీమాతో కార్మికులకు అండగా ఉంటున్నామని, చేనేత కళాకారులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి..