షర్మిల పార్టీ వెనుక బీజేపీ స్కెచ్..ఇదిగో పక్కా ఆధారాలు..?

241
sharmila
- Advertisement -

నేను మీ రాజన్న బిడ్డను, జగనన్న విడిచిన బాణాన్ని అంటూ వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్రలో చేసిన సమయంలో ఎక్కడకు వెళ్లినా తనదైన కీచుకంఠంతో ప్రజలను చావగొట్టేది. అలా తన అన్న జగన్ జైల్లో ఉన్న సమయంలో షర్మిల చేసిన యాత్ర అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీకే పరిమితం అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు తమది జాతీయ పార్టీ అని చెప్పుకున్నా…తెలంగాణలో సైకిల్ పార్టీ పూర్తిగా కిల్ అయిపోయింది. ఆంధ్రాపార్టీలకు ఇక్కడ స్థానం లేదని తెలంగాణ ప్రజలు తేల్చిచెప్పారు. తెలంగాణలో ఆంధ్రాపార్టీ టీడీపీ మళ్లీ బతికి బట్టకడుతుందని ఎవరికి నమ్మకం లేదు. ఈ తరుణంలో మరో ఆంధ్రా పార్టీ తెలంగాణలో పురుడు పోసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

జగనన్న విడిచిన బాణం అంటూ చెప్పుకునే వైఎస్ తనయ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు..ఎందుకు లేదు..నేను ఎందుకు పార్టీ పెట్టకూడదు..తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అంటూ షర్మిల కామెంట్ చేశారు. అయితే షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఉండివచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఊహించని విజయాలు సాధించిన బీజేపీ వచ్చేసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటున్నారు. అయితే కమలనాథులను సాగర్ బై ఎలక్షన్ భయపడుతోంది. ఇక్కడ బీజేపీకి అంత బలం లేదు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే. సాగర్‌లో బీజేపీ మూడోస్థానంలో నిలిచిస్తే బీజేపీకి ఎదురుదెబ్బే. సాగర్‌లో కాంగ్రెస్ గెలవకపోయినా రెండో స్థానంలో నిలిచినా చాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడిదే బీజేపీ పెద్దలను భయపెడుతోంది. అందుకే ప్లాన్ బి అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీసి వచ్చే ఎన్నికల కల్లా టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునేందుకు ‎బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా షర్మిల పార్టీని తెరమీదకు తీసుకువచ్చినట్లు ఊహాగానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువ. మొదటి నుంచి తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకే వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే గత పదేళ్లుగా రెడ్డి సామాజికవర్గం ఓట్లు కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పార్టీల మధ్య చీలిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ రెడ్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్య నాయకులు అంతా రెడ్డి సామాజికవర్గం చెందినవారే. ఒక వేళ సాగర్ ఎన్నికలలో అదృష్టవశాత్తు గెలిస్తే కాంగ్రెస్ మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు ఎవరికి వారు పాదయాత్రలు చేపట్టి కాంగ్రెస్‌కు ఊపు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు.. సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ గెలవకపోతే..ఆ పార్టీది వాపే కాని బలుపు కాదని తేలిపోతుంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పెడితే ఎవరికి లాభం..ఎవరికి నష్టం అని రాజకీయపార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గంలో మెజారిటీ శాతం వైఎస్ఆ‌ర్ అభిమానులే.. వైఎస్ తనయుడు జగన్ ఏపీకి పరిమితం అవడంతో తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ రెడ్లు, వైఎస్ అభిమానులుగా చీలిపోయింది. జగన్‌ను జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అభిమానులకు కోపం. అందుకే తెలంగాణలోని వైఎస్ఆర్ ఫ్యాన్స్ మొత్తం టీఆర్ఎస్‌వైపు మొగ్గు చూపుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలోను, జీహెచ్ఎంసీ ఎన్నికలలోను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కేసీఆర్‌కు మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు షర్మిల కనుక కొత్త పార్టీ పెట్టి ఊపు తెస్తే కాంగ్రెస్‌కు మద్దతిచ్చే రెడ్లలో కూడా చీలిక వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గంలో కొంత మంది షర్మిల పార్టీకి జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు భారీగా గండిపడే అవకాశం ఉంది. ఇక షర్మిల పార్టీ పెడితే తెలంగాణలో వైఎస్ఆర్‌పార్టీ వర్గాల్లో కూడా చీలిక వస్తుంది. జగన్ ఫ్యాన్స్, షర్మిల ఫ్యాన్స్‌గా వైసీపీ చీలిపోతుంది. జగన్ అభిమానులు టీఆర్ఎస్‌కే మద్దతు ఇస్తారు. ఇక టీఆర్ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య క్రిస్టియన్ ఓటు చెరిసగంగా చీలిపోయింది. ఇప్పుడు షర్మిల పార్టీ పెడితే క్రిస్టియన్లు సహజంగానే ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారు. తద్వారా కాంగ్రెస్‌ను సపోర్ట్ చేసే క్రిస్టియన్ ఓటు బ్యాంకు‌కు గండిపడుతుంది. ఇక ముస్లిం ఓటు బ్యాంకు ఎలాగూ ఎంఐఎం , టీఆర్ఎస్‌లకు ఉంటుంది. బీజేపీకి ఎలాగూ మైనారిటీ వర్గాల ఓట్లు పడవు. అందుకే బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందూత్వ వాదంతో హిందువుల ఓట్లను పోలరైజ్ చేస్తోంది. షర్మిల పార్టీ పెడితే కాంగ్రెస్‌కు బలమైన రెడ్డి సామాజికవర్గం ఓటు బ్యాంకు బీటలు వారుతోంది. బీజేపీకి కావాల్సింది అదే. మరో వైపు దేశవ్యాప్తంగా ముస్లింల ఓటు బ్యాంకు బీజేపీయేతర పార్టీలకు తరలిపోకుండా ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర, బీహార్, యుపీ, బెంగాల్‌లో పోటీ చేయడం వెనుక మోదీ, అమిత్‌షాల స్కెచ్ ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు అదే తరహాలో షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌తో సౌతిండియాలో క్రిస్టియన్ పార్టీ పెట్టించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ బీజేపీ అధిష్టానం వ్యూహంలో భాగంగానే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే షర్మిల పార్టీ పెడితే కాంగ్రెస్ దెబ్బతిని, బీజేపీకి లాభపడుతుందా అంటే చెప్పలేం. రెడ్లు, క్రిస్టియన్ల ఓట్లు కాంగ్రెస్, షర్మిల పార్టీ మధ్య చీలిపోతే అంతిమంగా టీఆర్ఎస్‌కే లబ్ది చేకూరే అవకాశం కూడా ఉంది. చెల్లెలు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇష్టం లేకపోవడం ఇక్కడి వైఎస్ అభిమానుల్లో కూడా కన్‌ఫ్యూజన్ ఏర్పడడం ఖాయం. మొత్తంగా వైఎస్ఆర్ తనయ, జగనన్న విడిచిన బాణం షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడం వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో పైకి తెలియకపోయినా.. ఆమె వెనుక కచ్చితంగా బీజేపీ పెద్దలు ఉండి వచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షర్మిల పార్టీతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారనున్నాయి. మరి కమలం పార్టీ విడిచిన బాణం.. ఏ పార్టీ గెలుపు అవకాశాలకు గండి కొడుతుందో మున్ముందు చూడాలి.

- Advertisement -