తెలంగాణ బీజేపీలో పరిస్థితులపై అమిత్ షా సీరియస్ గా ఉన్నారా…? పెద్ద నాయకులు పార్టీలోకి వస్తున్నారని సభ పెట్టించి… తుస్సుమనిపించారా…? ఈటలతో రాబోతున్న నేతలను బండి సంజయ్ అడ్డుకుంటున్నారా…? బండి సంజయ్ తీరుతో నడ్డా గుర్రుగా ఉన్నారా….? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరం పంచాయితీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ… కాంగ్రెస్ ను ఖాళీ చేయాలన్నది బీజేపీ హైకమాండ్ సూచన. ఈ క్రమంలో బండి సంజయ్ ఇతర నాయకులపై పైచేయి సాధించే క్రమంలో పార్టీనే ఫణంగా పెడుతున్నారని ఢిల్లీ నాయకత్వానికి పక్కా సమాచారం అందింది. ముఖ్యంగా టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉండి, అన్ని స్థాయిల నేతలతో చొరవ ఉన్న ఈటల రాజేందర్ బీజేపీకి అడ్వాంటేజ్ అని భావించారు.
ఈటల రాజేందర్ కూడా టీఆర్ఎస్ లో నేతలపై వల వేసే ప్రయత్నం చేశారు. కానీ, ఈటల రాజేందర్ ద్వారా చేరికలు జరిగితే తన పదవికి ప్రమాదమని, తనకు మైలేజ్ దక్కదన్న ఉద్దేశంతో ఈటల ద్వారా వచ్చే నేతలను అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి సైలెంట్ గా ఉన్న మాజీ ఎంపీ కొండా విషయంలోనూ ఇదే జరిగిందని…కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తను బీజేపీలో చేరుతున్నానని స్వయంగా ప్రకటించినా చొరవ తీసుకోకపోవటంలో బండి వైఫల్యమే కారణమని అధిష్టానానికి రిపోర్ట్ అందింది. నిజానికి రాష్ట్రానికి జేపీ నడ్డా వచ్చిన సమయంలోనే చేరికలుంటాయని ఈటల వర్గం ప్రచారం చేసింది. కానీ, దాన్ని అమిత్ షా మీటింగ్ కు పోస్ట్ పోన్ చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నేత ఓదేలు బీజేపీలో చేర్చేందుకు ఈటల ప్రయత్నించగా… పార్టీ నాయకత్వం ససేమిరా అనటంతో కాంగ్రెస్ తన్నుకపోయిందన్న ప్రచారం బీజేపీలో జోరుగా సాగుతుంది. దీంతో… అమిత్ షా త్వరలోనే మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారని, ఈసారి కేవలం పార్టీ కోసమే వస్తున్నారని… అందులో ఈ ఆధిపత్యపోరు చర్చకు వస్తుందని బండి వ్యతిరేక వర్గం ధీమాగా ఉంది.