తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
సాహితి ఇన్ఫ్రా సంస్థ నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చెందిన బ్యాంక్ ఖాతాల ద్వారా దాదాపు రూ. 2.1 కోట్లు మళ్లించినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ లావాదేవీల స్వభావం ఏమిటి? ఏ ఉద్దేశంతో ఈ నిధులు బదిలీ అయ్యాయి? అనే కోణంలో ఈడీ లీగల్ నోటీసుల ద్వారా ప్రశ్నించనుంది. అలాగే మనీలాండరింగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఆస్తులపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని చెప్పి ముందస్తు ఆఫర్లు (ప్రీ-లాంచ్ ఆఫర్లు) ఇచ్చి కొనుగోలుదారుల నుంచి సాహితి ఇన్ఫ్రా యాజమాన్యం భారీగా నిధులు వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకుండా తమను మోసం చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో తెలంగాణ పోలీసులు పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. తొలుత రూ. 248 కోట్ల మోసం జరిగిందని భావించినప్పటికీ తదుపరి సుదీర్ఘ దర్యాప్తులో ఈ కుంభకోణం విలువ ఏకంగా రూ. 842 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది.
కొనుగోలుదారుల నుంచి సేకరించిన నిధులను ప్రాజెక్టుల కోసం ఉపయోగించకుండా సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు తమ సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు అభియోగాలు మోపారు. దాదాపు రూ. 126 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ విచారణలో తేలింది.
ఈ కేసులో ఇప్పటివరకు 56 బ్యాంక్ ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.గతంలో రూ. 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయగా, తాజాగా మరో విడతలో రూ. 12.6 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.సంస్థ ప్రకటనల్లో (అంబాసిడర్గా) కనిపించిన ప్రముఖ నటుడు జగపతిబాబును సైతం ఈడీ గతంలో సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే.
Also Read:బాలాపూర్ లడ్డూ చరిత్ర…
ఈ కేసుకు సంబంధించి 2024 సెప్టెంబర్లోనే సంస్థ ఎండీ బి. లక్ష్మీనారాయణను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి సమన్లు జారీ కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.

