బాలాపూర్ గణేష్ లడ్డూ@రూ. 39 లక్షలు

8
- Advertisement -

హైదరాబాద్‌లో వినాయక చవితి శోభాయాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఆసక్తికరంగా మారే ‘బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట’ను తిలకించేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. పోటాపోటిగా సాగిన వేలంపాటలో సామ ప్రణీత్ రెడ్డి 39 లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు.

హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ప్రణీత్ రెడ్డి ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చి ‘అర్బన్ గ్రూప్స్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించారు. చిన్న వయస్సులోనే ఆయన వార్షిక లడ్డూ వేలం పాటలో పాల్గొని ఈ ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.

లడ్డూ వేలంలో పాల్గొనేందుకు నిర్వాహకులు విధించిన నిబంధనల ప్రకారం రూ. 35 లక్షల చొప్పున డిపాజిట్ చేసి, మొత్తం 9 మంది భక్తులు అర్హత సాధించారు. బాలాపూర్ గణపయ్య లడ్డూను దక్కించుకోవడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధించి, సకల జయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ఏటేటా ఈ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది. గతేడాది (2025) జరిగిన వేలంలో దశరథ్‌గౌడ్ అనే భక్తుడు రూ. 35 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.

Also Read:బాలాపూర్ లడ్డూ చరిత్ర…

ఈ ఏడాది బాలాపూర్ గణపయ్య ప్రత్యేకంగా రూపొందించిన ‘పూరీ జగన్నాథ ఆలయ’ నమూనా మండపంలో కొలువై నవరాత్రులు పూర్తి చేసుకున్నారు. గత తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్య, నేడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు.

ఉదయం వేలం పాట ప్రక్రియ ముగిసిన వెంటనే బాలాపూర్ గణపయ్య శోభాయాత్ర ప్రారంభమైంది. సుమారు 18.5 కిలోమీటర్ల సుదీర్ఘ మార్గంలో భక్తుల జయజయధ్వానాలు, ఊరేగింపులతో సాగే ఈ శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, చార్మినార్, అబిడ్స్ మీదుగా హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) చేరుకుని నిమజ్జనంతో ముగుస్తుంది.

- Advertisement -