పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లానాయక్’ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా.. విడుదల తేదీని ఫిబ్రవరి 25కి మార్చినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. శివరాత్రికి ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని ‘భీమ్లా నాయక్’ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ చిత్రానికి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిత్యా మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.