ప్రణబ్‌ ముఖర్జీని వరించిన ‘భారతరత్న’..

308
- Advertisement -

దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఈ ఏడాది ముగ్గురు ప్రముఖులను వరించింది. దేశ ఆర్థిక, రాజకీయ రంగాలను మలుపు తిప్పిన ఉత్తమ ఆర్థికవేత్త, ఉత్తమ పార్లమెంటేరియన్‌, మాజీ ప్రథమ పౌరుడు ప్రణబ్‌ ముఖర్జీని దేశంలోనే అత్యుత్తమ పౌర పురస్కారమైన భారతరత్న వరించింది. ప్రముఖ సంఘ సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్‌, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్‌ హజారికాలకు కూడా వారి మరణానంతరం ఈ అత్యున్నత పురస్కారం దక్కింది.

వీరిలో ప్రణబ్‌ ముఖర్జీ కాంగ్రెస్‌ కురువృద్ధుడు కాగా.. నానాజీ దేశ్‌ముఖ్‌ ఆరెస్సె్‌సలో కీలక నేత. ఇక, భూపేన్‌ హజారికా పౌరహక్కుల కోసం విశేష కృషి చేసిన వామపక్ష నేపథ్యమున్న గాయకుడు. రాజకీయ భావజాలాలకు అతీతంగా ఈ ముగ్గురికీ మోదీ ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. రాష్ట్రపతిగా పని చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రాజేంద్ర ప్రసాద్‌, జాకీర్‌ హుస్సేన్‌, వీవీ గిరి గతంలో భారతరత్నకు ఎంపికయ్యారు. ఇప్పుడు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్న ఐదో మాజీ ప్రథమ పౌరుడిగా ప్రణబ్‌ చరిత్రలో నిలవనున్నారు.

Bharat Ratna

పద్మవిభూషణ్‌లు..యెమెన్‌ నుంచి భారతీయులతోపాటు, వివిధ దేశాల వారిని రక్షించడంలో కీలకపాత్ర పోషించిన డిజిబౌటి అధ్యక్షుడు ఇస్మాయిల్‌ ఒమర్‌ గుయెల్లె, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జానపద గాయని తీజన్‌బాయి, మహారాష్ట్రకు చెందిన ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌, మహారాష్ట్రకు చెందిన రంగస్థల కళాకారుడు బల్వంత్‌ మొరేశ్వర్‌ పురందరెలకు పద్మవిభూషణ్‌ పురస్కారాలు ప్రకటించింది.

పద్మభూషణులు..ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌, తప్పుడు కేసుల్లో ఇరుక్కొని చివరికి సుప్రీంకోర్టు కోర్టు ద్వారా నిర్దోషిగా విడుదలైన అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్‌, దివంగత పాత్రికేయుడు కులదీప్‌ నయ్యర్‌, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌, ప్రస్తుత ఎంపీ కరియాముండా, 6 సార్లు పార్లమెంటుకు ఎంపికైన భాజపా ఎంపీ, కేంద్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌, అకాలీదళ్‌ నేత, మూడుసార్లు ఎంపీ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా, ఎండీహెచ్‌ మసాలా వ్యవస్థాపకులు, సీఈఓ మహాశయ్‌ ధర్మపాల్‌, పర్వతారోహకురాలు బచేంద్రీపాల్‌, మాజీ కాగ్‌ వీకే షుంగ్లూలకు పద్మభూషణ్‌ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, దివంగత బాలీవుడ్‌ నటుడు కాదర్‌ఖాన్‌, భారత క్రికెట్‌ క్రీడాకారుడు గౌతంగంభీర్‌, మాజీ రాయబారి జైశంకర్‌ పద్మశ్రీ వరించిన ప్రముఖుల్లో ఉన్నారు.

తెలుగు పద్మ శ్రీలు..తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్‌ సాధించిన సునీల్‌ ఛెత్రి, 3 వేలకు పైగా సినీగీతాలు రాసిన సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దశాబ్దకాలంగా చెస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 2011 చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ప్రముఖ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ‘రైతునేస్తం’ ఫౌండేషన్‌ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పాత్రికేయుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

- Advertisement -