గత మూడు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక సీఎం సీటు గొడవ నేటితో ముగిసింది. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దపడ్డ యడ్యూరప్పకు చేదుఅనుభవం ఎదురైంది. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అసెంబ్లీలో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు యడ్యూరప్ప. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ నుంచి ఆయన నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖను అందించనున్నారు. బలపరీక్ష కూడా జరగకుండానే ఆయనే తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల 104 స్థానాల్లో ప్రజలు భాజపాను గెలిపించి ఆశీర్వదించారన్నారు. కాంగ్రెస్ , జేడీఎస్ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయాయన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని అసెంబ్లీలో గుర్తు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ తెరచాటున చేస్తున్న రాజకీయాలను ఖండిస్తున్నామ్నారు. గతంలో కాంగ్రెస్ హయంలో ప్రజలు సంతోషంగా లేరన్నారు.
ప్రజల కష్టాలు దగ్గరుండి చూశారని తెలిపారు. రాష్ట్రంలో ని ప్రజలకు న్యాయం జరిగే వరకూ నిరంతర పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కట్టలేదని చెప్పారు. యడ్యూరప్ప కేవలం రెండు రోజుల మాత్రమే సీఎం గా చేసే అదృష్టం వరించిందని చెప్పుకొవాలి. ఇక బీజేపీ తిసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతల్లో ఉత్సాహం నెలకొంది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుల భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.