అవకాశాలు అందిస్తే తమ ప్రతిభను చాటుతాం అంటున్నారు నేటి ఆడపిల్లలు. చదువుతో పాటు అనేక రంగాల్లో రాణిస్తూ దేశ ప్రగతిని నలుదిశలా చాటేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మహాత్మా జ్యోతి బా ఫూలే బిసి గురుకుల విద్యార్థి మౌనిక రైఫిల్ షూటింగ్ లో విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. గత ఆరునెలలుగా శిక్షణ పొందుతున్న మౌనిక వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో జరిగే రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్నే అర్హత సాధించింది. ఈ సందర్భంగా మౌనికను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్, మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు అభినందించారు.
గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులను చదువుతో పాటు అనేక రంగాల్లో ప్రొత్సహిస్తూ వారిలోని ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా కీసర లోని మహాత్యా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల బాలికల పాఠశాలలో రైఫిల్ షూటింగ్ శిక్షణ ప్రారంభించారు. ఆసక్తి గల విద్యార్థులకు కోచ్ సహాయంతో శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 25మంది బాలికలు శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో తొమ్మిదో తరగతి చదువుతున్న మౌనిక విశేష ప్రతిభను కనబరచడంతో ఆమెను గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్ఠాయి పోటీలకు పంపించారు. అక్కడ మంచి ర్యాంక్ సాధించిన మౌనిక సౌత్ జోన్ స్ఠాయి పోటీలకు ఎంపిక కావడంతో గత నెల కేరళలో జరిగిన పోటీలకు పంపించారు. అక్కడ తన ప్రతిభను ప్రదర్శించిన మౌనిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇప్పటికే రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్ని తన ప్రతిభను నిరూపించిన మౌనిక ఈనెల 8న భోపాల్ లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్ని రైఫిల్ షూటింగ్ లో తన గురి తప్పదని మరోసారి నిరూపించింది. జాతీయ స్థాయిలో వచ్చే ఏడాది జరిగే పోటీలకు ఎంపికైంది.
ఐపిఎస్ అవుతా..
– మౌనిక, 9వ తరగతి, చార్మినార్ బాలికల గురుకుల పాఠశాల
అమ్మనాన్న పెద్దగా చదువుకోకపోయినా నన్ను తమ్ముడిని బాగా చదివించాలని కష్టపడుతున్నారు. ఐదోతరగతిలో చార్మినార్ గురుకుల పాఠశాలో చేరాను. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుచేశారు. అప్పుడే రైఫిల్ ను చూడటం. గురి చూసి లక్ష్యాన్ని చేధించడం బాగా నచ్చింది. అయితే కరోనా కారణంగా స్కూల్ కు సెలవులు ఇవ్వడంతో శిక్షణ ఆగిపోయింది. ఈ ఏడాది స్కూల్ ప్రారంభం కాగానే రైఫిల్ షూటింగ్ శిక్షణ కూడా మొదలుపెట్టారు. క్రమంగా తప్పకుండా క్లాస్ కు వెళ్లేదాన్ని. కోచ్ సార్, ప్రిన్సిపాల్ సార్, సెక్రటరీ సార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయి, సౌత్ జోన్ స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జరిగే పోటీల్లోనూ పాల్గొన్ని మెడల్స్ సాధిస్తాను. నన్ను ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు.మా లాంటి పేదవారికి ఉచిత విద్యను అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సార్, మంత్రి గంగుల కమలాకర్ సార్ కు ధన్యవాదాలు. ఉన్నత చదువులు చదివి ఐపిఎస్ కావాలన్నదే నా లక్ష్యం.
పట్టుదల చూసి..
– రాములు గౌడ్, ప్రిన్సిపల్
రైఫిల్ షూటింగ్ అనగానే చాలామంది అమ్మాయిలు భయపడ్డారు. కానీ కొందరు అమ్మాయిలు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు. వారిలో మౌనిక చాలా పట్టుదలతో నేర్చుకుంది. కరోనా తర్వాత స్కూల్ ప్రారంభం కాగానే కోచింగ్ లో చేరింది. ఆ అమ్మాయి ప్రతిభను, పట్టుదలను గుర్తించిన కోచ్ రాష్ట్రస్థాయిలో పాల్గొన్నేలా కోచింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జోనల్, జాతీయ స్థాయిలోనూ పాల్గొన్ని వచ్చే ఏడాది జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించింది. ఆడపిల్లలకు రైఫిల్ కోచింగ్ ఇవ్వాలన్న బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం , ఐఎఎస్ గారి ప్రోత్సాహం, మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి గురుకుల విద్యాసంస్థలు కార్యదర్శి మల్లయ్యబట్టు సార్ సంకల్పంతోనే సాధమైంది. మౌనికతో పాటు మరెందరో అమ్మాయిలు రైఫిల్ షూటింగ్ లో రాణిస్తారని ఆశిస్తున్నాం.
ఇవి కూడా చదవండి..