ఐపిఎల్ మ్యాచ్ లో తనదైన ప్రతిభ కనబర్చి అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజర్ రెహ్మాన్. తాజాగా బంగ్లాదేశ్ బోర్డు ఆయనకు షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్ లు ఆడరాదని ఆదేశాలు జారీ చేసింది. ఇండియాలో జరిగే ఐపిఎల్ మ్యాచ్ లో ఎట్టి పరిస్ధితుల్లో పాల్గోనరాదని చెప్పింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ ఈవిషయాన్ని వెల్లడించారు. దీనికి కారణం ముస్తాఫిజర్ రెహ్మాన్ ఎక్కువగా గాయాల పాలవుతున్నాడని దింతో బంగ్లాదేశ్ లో జరిగే మ్యాచ్ లలో ఆడలేకపోతున్నాడని స్పష్టం చేశారు.
అందుకే రెండేళ్ల పాటు ముస్తాఫిజర్ ను విదేశి క్రికెట్ కు దూరంగా ఉంచనున్నట్లు తెలిపారు. ముస్తాఫిజర్ కు ఎక్కువగా గాయాలవ్వడంతో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదన్నారు. విదేశీ లీగ్‌ల్లో ఆడి గాయాలపాలై స్వదేశానికి వచ్చి బోర్డు ఫిజియోల సమక్షంలో కోలుకుంటున్నాడన్నారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజర్ కీలకమైన బౌలర్ అని అతను జట్టులో ఆడకపోవడం వల్ల చాలా మ్యాచ్ లు ఓడిపోయామన్నారు. 2015లో బంగ్లాదేశ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముస్తాఫిజర్ 10 టెస్టులు, 27 వన్డేలు, 24 టీ20లు మాత్రమే ఆడాడు. 2016 నుంచి ముస్తాఫిజర్ ఐపిఎల్ లో ఆడుతుండగా..2016, 17 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడగా…2018లో ముంబాయ్ తరపున ఆడాడు. ఐపిఎల్ మూడు సిజన్లలో కలిపి మొత్తం 24 మ్యాచ్ లు ఆడిన ముస్తాఫిజర్ 24 వికెట్లు తీశాడు.