ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో మెరిసారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జంట సురుచి సింగ్, కమల్‌జీత్ పసిడి పతకం సాధించారు. తుది పోరులో సంచలన ప్రదర్శన చేసిన ఈ జోడీ కొత్త ఆసియా రికార్డును నెలకొల్పి భారత్‌కు టోర్నీలో రెండో స్వర్ణ పతకాన్ని అందించారు.
ఫైనల్లో భారత జంట మొత్తం 484.6 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉజ్బెకిస్తాన్ (481.3 పాయింట్లు) పేరిట ఉన్న పాత ఆసియా రికార్డును సురుచి-కమల్‌జీత్ చెరిపివేశారు.
దక్షిణ కొరియా జంట 478.0 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, ఇరాన్ (415.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇండోనేషియా 349.4 పాయింట్లతో నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది.
ఫైనల్ మ్యాచ్ మొదలైనప్పటి నుంచీ భారత షూటర్లు పూర్తి నియంత్రణ సాధించారు. తొలి సిరీస్‌లోనే 103 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ, చివరి వరకు అదే జోరును కొనసాగించి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఈ పసిడి పతకంతో ప్రసుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది (2 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలు). భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకను ఓడించి తొలి స్వర్ణాన్ని అందించగా ఇప్పుడు షూటింగ్‌లో రెండో స్వర్ణం దక్కింది.
Also Read:ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం..అప్‌డేట్స్

