రివ్యూ:పైసా వసూల్

257
Balakrishna's Paisa Vasool Movie Review
Balakrishna's Paisa Vasool Movie Review
- Advertisement -

గౌతమి పుత్ర శాతకర్ణితో న‌టుడిగా వంద సినిమాలు పూర్తి చేసి 101వ చిత్రం పైసా వ‌సూల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నంద‌మూరి బాల‌కృష్ణ ‌. బాలయ్య- పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేషన్‌ కావ‌డంతో సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది. అలాగే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో బాల‌య్య బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ అన్ని కొత్త‌గా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. మ‌రి ఈ అంచ‌నాల‌ను బాల‌కృష్ణ పైసా వ‌సూల్ రీచ్ అయ్యిందా లేదా అని తెలియాలంటే రివ్యూ చదవండి..

కథ:
తేడాసింగ్‌(నంద‌మూరి బాల‌కృష్ణ‌) తీహార్‌ జైలు నుంచి బయటకు వస్తాడు. దేనికీ భయపడడు. ఎవరినైనా ఎదిరిస్తాడు. తేడాసింగ్‌ త‌ను ఉండే కాల‌నీలో త‌న ప‌క్కింట్లో ఉండే హారిక‌(ముస్కాన్‌) వెంట‌ప‌డుతుంటాడు. సారిక(శ్రేయ) హారికకు అక్క అవుతుంది. పోర్చుగ‌ల్ వెళ్లిన సారిక క‌న‌ప‌డకుండా పోతుంది. హారిక తన అక్క‌య్య సారిక‌(శ్రియా) కోసం వెతుకుతూ ఉంటుంది. బాబ్ మార్లే(విక్ర‌మ్ జీత్‌) ఓ పెద్ద మాఫియా డాన్‌. పోర్చుగ‌ల్‌లో ఉంటాడు. బాబ్ త‌మ్ముడు స‌న్ని(అమిత్‌)ను ఇండియ‌న్ రా ఎజెంట్‌ చంపడంతో.. ఇండియాపై పగ పెంచుకుంటాడు బాబ్. అందుకోసం ఇండియాలో పలు నగరాల్లో బాంబులు పెట్టి మార‌ణ హోమం సృష్టిస్తాడు. హైద‌రాబాద్‌లో రెండు, మూడు చోట్ల బాంబు పేలుళ్లు జ‌రుగ‌ుతాయి. అమాయ‌కులైన జ‌నం చ‌నిపోతారు.

Balakrishna

మరోవైపు బాబ్‌కు ఇండియాలో ఓ రాజకీయ నేత అండ ఉంటుంది. పోలీస్ అధికారులు వరుసగా హత్యలకు గురౌతూ ఉంటారు. అలాంటి స‌మ‌యంలో రా చీఫ్‌(క‌బీర్ బేడి), ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌ను ఈ మాఫియాకు వ్య‌తిరేకంగా వాడుకుని అంతమొందించాల‌నుకుంటాడు. అందులో భాగంగా తేడాసింగ్‌(నంద‌మూరి బాల‌కృష్ణ‌)తో పోలీస్ డిపార్ట్‌మెంట్ డీల్ కుదుర్చుకుంటుంది. అయితే చివ‌ర‌కు హారికకు, త‌న‌ అక్క‌య్య సారిక‌కు, తేడాసింగ్‌కు మ‌ధ్య ఓ రిలేష‌న్ ఉంద‌ని తెలుస్తుంది. ఆ రిలేష‌న్ ఏంటి? అస‌లు తేడా సింగ్ ఎవ‌రు? సారిక‌, హారిక ఫ్యామిలీకి తేడాసింగ్ ఎందుకు ద‌గ్గ‌ర‌వుతాడు? అస‌లు సారిక ఏమవుతుంది? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Balayya-and-Shriya

ప్లస్ పాయింట్స్‌:
రా ఏజెంట్‌గా బాల‌కృష్ణ‌ను దర్శ‌కుడు ఎలివేట్ చేసిన తీరు, బాల‌కృష్ణ వ్యావ‌హారిక శైలి చాలా వ‌ర‌కు `పోకిరి` చిత్రాన్ని, పూరి గ‌త చిత్రాల‌ను గుర్తుచేస్తాయి. బాలకృష్ణ ఇప్పటి వరకు ఉన్న స్క్రీన్ ఇమేజ్‌తో పోల్చితే ఈ చిత్రంలో చాలా డిఫరెంటుగా కనిపించారు. భారీ డైలాగులు, భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాల‌య్య‌కు కొత్త కాదు. క్లైమాక్స్ లో బాల‌కృష్ణ దేశం గురించి, దేశ‌భ‌క్తి గురించి మాట్లాడిన తీరు మెప్పిస్తుంది. హీరోయిన్లు వారి వారి ప‌రిధుల్లో బాగానే న‌టించారు. హీరోయిన్లు ముగ్గురు ఉన్నా అధిక ప్రాధాన్యం శ్రియకు మాత్రమే. పోర్చుగల్‌ ఎపిసోడ్‌లో మాత్రమే ఆమె కనిపిస్తుంది. కథకు ఆ పాత్రే కీలకం. కైరా దత్‌ ఐటమ్‌ సాంగ్‌లో చిందులు వేయడంతో పాటు ఆమె పాత్ర ఏంటనేది ఆసక్తికరం. కబీర్‌బేడీ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

muskan

మైనస్ పాయింట్లు:
క‌థలోనూ చెప్పుకోద‌గ్గంత కొత్త‌ద‌నం ఏమీ లేదు. సినిమాలో ప్ర‌త్యేకంగా పెద్ద‌గా కామెడీ లేదు. అలీని చూడ‌గానే ఎవ‌రైనా కామెడీ ఉంటుంద‌ని ఊహిస్తారు. కానీ అలీ పాత్ర ఉండాలి కాబ‌ట్టి ఉన్న‌ట్టు అనిపిస్తుంది. రీరికార్డింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బావుండేదేమో. మినిస్ట‌ర్‌గా న‌టించిన కృష్ణ‌స్వామి శ్రీకాంత్ ముఖంలో భావోద్వేగాలు స‌రిగా ప‌ల‌క‌లేదు. పూరీ జగన్నాథ్ ఈ మాఫియా బ్యాగ్రౌండ్ నేపథ్యాల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది.

సాంకేతిక విభాగం:
దర్శకుడు పూరీ జగన్నాద్ యాక్షన్‌ సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. పోర్చుగల్‌ ఎపిసోడ్‌ పెద్దదిగా ఉన్నా, పూరి సరికొత్తగా ఆయా సన్నివేశాలను చూపించాడు. పూరి గత చిత్రాల ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నా, మధ్యలో వచ్చే ట్విస్టులు కొత్తగా అనిపిస్తాయి. అనూప్‌ పాటలు బాగున్నాయి. ‘పైసా వసూల్’, ‘మామా ఏక్‌ పెగ్‌లా’ మాస్‌కు నచ్చుతాయి. కెమేరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి తక్కువ. చాలా షార్ప్‌గా ఎడిట్‌ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి..

తీర్పు:
ఒక కొత్త బాలకృష్ణను చూడాలంటే ‘పైసావసూల్’ చూడాల్సిందే. ఇంటర్వెల్‌కు ముందు బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ (ఓన్లీ ఫ్యాన్స్‌ అండ్‌ ఫ్యామిలీ, ఔటర్స్‌ నాట్‌ అలౌడ్‌) అదిరిపోయింది. ఇందులో బాలకృష్ణ డైలాగ్‌ డెలివరీ గత సినిమాల్లో ఎక్కడా కనిపించదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే మాస్‌ను, బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రించే పూరి జ‌గ‌న్నాథ్ మార్కు చిత్ర‌మిది.

విడుదల తేదీ:31/09/2017
రేటింగ్ : 3\ 5
న‌టీన‌టులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌
సంగీతం: అనూప్ రూబెన్స్‌
నిర్మాత‌: వి.ఆనంద ప్ర‌సాద్‌
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌

- Advertisement -