సైబర్ ఫ్రాడ్..మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా?

1
- Advertisement -

నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న అవసరానికి డిజిటల్ లావాదేవీలపైనే ఆధారపడుతున్నాం. అయితే ఈ సాంకేతిక విప్లవం ఎంతటి సౌకర్యాన్ని తెచ్చిపెట్టిందో….అంతే స్థాయిలో సైబర్ నేరగాళ్లకు సరికొత్త అవకాశాలను సృష్టించింది. రోజురోజుకూ మారుతున్న క్రమాల్లో అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాలను సైబర్ కేటుగాళ్లు క్షణాల్లో ఖాళీ చేస్తున్నారు.

()డిజిటల్ అరెస్ట్… ఇటీవలి కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారిన మోసం ఇది. ముఠా సభ్యులు సిబిఐ (CBI), ఈడీ (ED) లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులమంటూ తప్పుడు ఐడీ కార్డులతో వీడియో కాల్స్ చేస్తారు. మీ పేరు మీద ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయి అని లేదా మీ ఆధార్ కార్డ్ మనీలాండరింగ్‌కు వాడారు అని భయపెడతారు. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు పంపాలని గంటల తరబడి వీడియో కాల్‌లోనే బంధించి (డిజిటల్ అరెస్ట్) లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.

()పార్సిల్ స్కామ్స్..మీకు కొరియర్ సంస్థల నుండి ఫోన్ కాల్స్ వస్తాయి. మీ పేరుతో తైవాన్ లేదా విదేశాలకు వెళ్తున్న పార్శిల్‌లో నిషేధిత వస్తువులు ఉన్నాయని, కస్టమ్స్ అధికారులు దాన్ని ఆపారని నమ్మిస్తారు. ఆపై పోలీస్ అధికారుల పేరుతో భయపెట్టి అకౌంట్లలోని సొమ్మును కాజేస్తారు.

()పార్ట్-టైమ్ జాబ్ ఆఫర్లు..ఇంట్లో కూర్చునే రోజుకు రూ. 5,000 సంపాదించండి , యూట్యూబ్ వీడియోలకు లైక్ కొడితే చాలు డబ్బులు ఇస్తాం అంటూ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా లింకులు పంపుతారు. మొదట్లో నమ్మకం కోసం రూ. 200 నుండి రూ. 500 వరకు ఇస్తారు. ఆ తర్వాత టాస్క్‌ల పేరుతో మీతోనే వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయించి, చివరకు ఆ గ్రూపుల నుండి మిమ్మల్ని బ్లాక్ చేస్తారు.

గుర్తు తెలియని వీడియో కాల్స్ ఎత్తకండి… పోలీసు లేదా దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ వాట్సాప్, స్కైప్ లలో వీడియో కాల్స్ చేసి విచారణ జరపవు. చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని గుర్తుంచుకోండి. ఓటీపీ, పిన్ నంబర్లు షేర్ చేయొద్దు.. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ల్యాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, యూపీఐ పిన్ లేదా ఓటీపీ (OTP) లని ఎవరికీ చెప్పకండి. బ్యాంక్ సిబ్బంది కూడా వీటిని అడగరని గ్రహించండి.

తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు వస్తాయనే ప్రకటనలను నమ్మకండి. ముఖ్యంగా యాప్‌ల ద్వారా ఇచ్చే ఇన్‌స్టంట్ లోన్‌ల జోలికి వెళ్లకండి.లింకులపై క్లిక్ చేయొద్దు…లాటరీ తగిలిందని, కరెంట్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని వచ్చే మెసేజ్‌లలోని లింకులను క్లిక్ చేయకండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి రెండు గంటల (Golden Hours) లోపే కేంద్ర ప్రభుత్వ జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలి. మీరు ఎంత త్వరగా స్పందిస్తే మీ అకౌంట్ నుండి పోయిన డబ్బును బ్యాంకులు ఫ్రీజ్ చేసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.

Also Read:TMC:ఈసీ ముందుకు టీఎంసీ సంక్షోభం!

- Advertisement -