భారతీయులకు అలెర్ట్..ప్రయాణాలు వద్దు!

0
- Advertisement -

పశ్చిమ ఆసియా లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం కీలకమైన ప్రయాణ మార్గదర్శకాలను (Advisory) జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ప్రాంతీయంగా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచించింది.

ఈ ప్రాంతంలో గత మూడు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరాన్ – అమెరికా దేశాలు ఒక శాంతి ఒప్పందానికి అంగీకరించిన కొద్ది రోజులకే భారత్ ఈ అడ్వైజరీని జారీ చేయడం గమనార్హం. భారత రాయబార కార్యాలయం తన ప్రకటనలో ఇరాన్‌లోని తాజా భద్రతా పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది.

ఇరాన్‌లో పరిస్థితులు మునుపటి కంటే మెరుగుపడినప్పటికీ, తదుపరి అప్‌డేట్ వచ్చే వరకు భారత పౌరులు అత్యవసరమైతే తప్ప ఇరాన్ పర్యటనలు పెట్టుకోవద్దని కోరింది. ప్రస్తుతం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు అలాగే అత్యవసర పనులపై ఇరాన్‌కు చేరుకునే వారు ఎవరైనా సరే.. వీలైనంత త్వరగా టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది.

ఇరాన్‌లో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని, అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైన సమాచారం కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం గమనిస్తూ ఉండాలని పేర్కొంది.

Also Read:TMC:ఈసీ ముందుకు టీఎంసీ సంక్షోభం!

- Advertisement -