సంతోష్ కుమార్‌కు కెన్యా గ్రీన్ అంబాసిడర్‌గా ఆహ్వానం

4
- Advertisement -

లండన్‌లోని ప్రఖ్యాత ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్ (హౌస్ ఆఫ్ లార్డ్స్) వేదికగా తెలంగాణ పల్లెలో పుట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఘనత విశ్వవ్యాప్తమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ మోడల్ ఇప్పుడు ప్రపంచ వేదికలపై ప్రశంసలు అందుకుంటోంది. లండన్ క్లైమేట్ యాక్షన్ వీక్‌లో భాగంగా జూన్ 23, 2026న జరిగిన ‘ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్’ సదస్సులో కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. రాంఫాల్ ఇన్‌స్టిట్యూట్, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సు.. పర్యావరణ పరిరక్షణలో యువత, క్రీడల పాత్రను ప్రధానంగా చర్చించింది. సదస్సులో రాజ్యసభ మాజీ సభ్యులు, ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మన్ జే సంతోష్ కుమార్ కీలక ప్రసంగం చేశారు.

కొదురుపాక నుంచి లండన్ దాకా

“నేను ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడికి రాలేదు.. వేకువజామునే నీళ్లు మోసుకువచ్చి నీటి విలువ తెలుసుకున్న తెలంగాణలోని కొదురుపాక అనే చిన్న గ్రామానికి చెందిన ఒక బిడ్డగా ఇక్కడికి వచ్చాను” అంటూ సంతోష్ కుమార్ తన ప్రసంగాన్ని హృద్యంగా ప్రారంభించారు. తెలంగాణలోని ఒక పల్లెటూరిలో మొదలైన చిన్న ఆలోచన హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎలా చేరుకుందో ఆయన వివరించారు. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ద్వారా ఎలాంటి బడ్జెట్ లేకుండా కేవలం ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణాన్ని ఎలా కాపాడుతున్నామో వివరించారు. 2018 నుంచి ఇప్పటివరకు ఏకంగా 19.6 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. ఈ మహా క్రతువులో 4.4 కోట్ల మంది పౌరులు భాగస్వాములయ్యారని స్పష్టం చేశారు. తాము నాటిన ప్రతి మొక్కకూ 2024 నుంచి జియో ట్యాగింగ్ చేసి శాటిలైట్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమాల్లో ఒకటిగా మారిందన్నారు.

కేసీఆర్ దార్శనికత వల్లే పెరిగిన అటవీ విస్తీర్ణం

తెలంగాణ పచ్చబడటంలో మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు (KCR) దార్శనికతను ఆయన ఈ అంతర్జాతీయ వేదికపై కొనియాడారు. పురాతన భారతీయ సంప్రదాయమైన ‘పంచభూతాల’ పరిరక్షణను కేసీఆర్ ఆధునిక పాలనతో మిళితం చేశారని, దాని ఫలితంగా కేవలం పదేళ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 21 శాతం నుంచి 28 శాతానికి పెరిగిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. అడవుల పునరుద్ధరణతో పులుల సంఖ్య 12 నుంచి 44కు చేరిందని, 5,000కు పైగా బోరుబావుల పునరుద్ధరణ ద్వారా ఏటా 3.57 టీఎంసీల నీటిని ఆదా చేస్తున్నామని గణాంకాలతో సహా వివరించారు.

అతిథులకు ‘వెదురు’ కానుక.. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో సదస్సు

పర్యావరణంపై కేవలం ప్రసంగాలు ఇవ్వడమే కాకుండా, ఆచరణలో చూపించేందుకు ఈ సదస్సుకు హాజరైన ప్రతి అతిథికి, స్పీకర్‌కు ఒక వెదురు మొక్కను జియో ట్యాగింగ్ చేసి బహుమతిగా అందించారు. వెదురు చెట్టు గాలిలోని కార్బన్‌ను నాలుగు రెట్లు ఎక్కువగా పీల్చుకోవడమే కాకుండా, భూమిని పునరుద్ధరించే అద్భుతమైన లక్షణం కలిగి ఉంటుందని సంతోష్ కుమార్ తెలిపారు.

రాబోయే గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్, ఆంటిగ్వా, బార్బుడాలో జరిగే చోగమ్ (CHOGM 2026) సమావేశాల కంటే ముందు జరుగుతున్న ఈ లండన్ సదస్సు పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ‘హైదరాబాద్ క్లైమేట్ యాక్షన్ వీక్’ జరగనుందని సంతోష్ కుమార్ వెల్లడించారు. “వసుధైవ కుటుంబకం (ప్రపంచమంతా ఒకే కుటుంబం)” అనే భారతీయ సిద్ధాంతంతో పర్యావరణ పరిరక్షణకు అందరూ ఒకే కుటుంబంగా కలిసిరావాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కామన్వెల్త్ దేశాలతో, ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.

సంతోష్ కుమార్‌పై ప్రశంసల వర్షం

ఈ సదస్సులో పాల్గొన్న కెన్యా ప్రతినిధి బృందం ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మన్ జోగినిపల్లి సంతోష్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. కెన్యా డిప్యూటీ స్పీకర్ సెనేటర్ కతూరి మురుంగి నేతృత్వంలోని ఎంపీల బృందం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అవసరమైన గొప్ప ఉద్యమంగా కీర్తించారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని చేపట్టిన జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఇటువంటి పర్యావరణ ఉద్యమాన్ని కెన్యాలోనూ విస్తరించేందుకు సంతోష్ కుమార్‌ను ‘గ్రీన్ అంబాసిడర్’గా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అడవుల పెంపకం కోసం ఇగ్నైటింగ్ మైండ్స్‌తో కలిసి పనిచేస్తామని ఆసక్తిని వ్యక్తం చేశారు.

పర్యావరణ పరిరక్షణలో యువతదే కీలక భాగస్వామ్యం – లార్డ్ ఉదయ్ నాగరాజు

ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, 4 కోట్ల 40 లక్షల మంది పౌరులు, యువత, క్రీడాకారుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం గర్వకారణంగా ఉందని లార్డ్ ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో యువతే నిజమైన మార్పు తీసుకువస్తారని ఆయన అభివర్ణించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో విజయవంతమైన ఈ విధానాన్ని గ్లోబల్ నార్త్ (పాశ్చాత్య) దేశాలకు విస్తరించేందుకు, తద్వారా ఖండాలకతీతంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

యువత సామర్థ్యాన్ని వెలికితీసే సరైన వేదిక – సురేష్ యాదవ్, సీనియర్ డైరెక్టర్, కామన్వెల్త్ సెక్రటేరియట్

56 కామన్వెల్త్ సభ్య దేశాల్లోని యువత సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం అద్భుతంగా వెలికితీస్తోందని ఆయన అన్నారు. ‘ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్’ అనేది సముద్రాల పరిరక్షణకు సంబంధించిన కామన్వెల్త్ బ్లూ చార్టర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు యువత ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు తమ సెక్రటేరియట్ పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు.

క్రీడలతో పర్యావరణ చైతన్యం – కరెన్-మే హిల్, ఆంటిగ్వా అండ్ బార్బుడా హైకమిషనర్

యువతరంలో స్ఫూర్తి నింపేందుకు ప్రపంచ క్రీడా రంగానికి ఉన్న అద్భుతమైన శక్తిని ఆమె తన కీలక ప్రసంగంలో వివరించారు. క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడలకు చెందిన ప్రముఖులను ఇందులో భాగస్వాములను చేసినందుకు ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థను ఆమె అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలకు ప్రముఖ క్రీడాకారులు మరింత మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. వాతావరణ మార్పులపై పోరాటంలో చిన్న ద్వీప దేశాలు, తీరప్రాంత దేశాలను ప్రధాన కేంద్రంగా ఉంచాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.

జీరో వేస్ట్ క్రీడలకే ప్రాధాన్యం – ప్రిత్‌పాల్ సుర్జ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రతినిధి

రాబోయే గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్‌ను తక్కువ కార్బన్ ఉద్గారాలు, జీరో వేస్ట్ (చెత్తలేని) క్రీడలుగా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. క్రీడల ద్వారా వెలువడే 95% చెత్తను డంపింగ్ యార్డ్‌లకు వెళ్కుండా రీసైకిల్ చేస్తామని, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని తెలిపారు. క్రీడలు ప్రారంభం కావడానికి ముందే కామన్వెల్త్ దేశాల జలవనరుల నుంచి పది లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు రాయల్ కామన్వెల్త్ సొసైటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు.

కొన్ని దేశాల జనాభా కంటే ఇగ్నైటింగ్ మైండ్స్ నాటిన మొక్కల సంఖ్యే ఎక్కువ – డాక్టర్ డేవిడ్ గోమెజ్, డైరెక్టర్, రాంఫాల్ ఇన్‌స్టిట్యూట్

కొన్ని దేశాల జనాభా కంటే ఇగ్నైటింగ్ మైండ్స్ ద్వారా నాటిన మొక్కల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం అని ఆయన అన్నారు. శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర అభివృద్ధి, ప్రకృతి ఆధారిత పరిష్కారాలు (సీవీడ్, బ్లూ-కార్బన్ విధానాలు) వంటి అంశాలపై ఇగ్నైటింగ్ మైండ్స్‌తో కలిసి పనిచేయడానికి ఆయన తీవ్ర ఆసక్తి కనబరిచారు.

ఆకట్టుకున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ గణాంకాలు

కేవలం మాటలకే పరిమితం కాకుండా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సాధించిన అద్భుతమైన ఫలితాలను ఈ సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

2018లో ప్రారంభమైన ఈ ఉద్యమం ద్వారా ఇప్పటివరకు 19.6 కోట్లకు (196+ million) పైగా మొక్కలు నాటారు. సాంకేతికతను జోడించి 2024 నుంచి వీటికి జియో-ట్యాగింగ్ చేయడంతో పాటు, శాటిలైట్ ద్వారా వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో 4.4 కోట్ల మంది పౌరులు భాగస్వాములయ్యారు. 33 దేశాల్లో 21 వేలకు పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టడం ద్వారా ఏటా 3.57 TMC ల నీటిని ఆదా చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారత రాష్ట్రపతి ప్రశంసలతో పాటు UNFCCC COP29, UNCCD COP16 అబ్జర్వర్ హోదాను పొందింది.

గ్లాస్కో నుంచి హైదరాబాద్ వరకు

సదస్సు ముగింపులో భవిష్యత్ కార్యాచరణను (Roadmap) ప్రతినిధులు ఖరారు చేశారు. రాబోయే గ్లాస్కో గేమ్స్, ఆంటిగ్వాలో జరిగే CHOGM 2026 సదస్సుతో పాటు హైదరాబాద్ క్లైమేట్ యాక్షన్ వీక్ 2026 (Hyderabad Climate Action Week 2026) ను విజయవంతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. యువత, విధాన నిర్ణేతలు, క్రీడాకారులు ఒక్కతాటిపైకి వస్తే వాతావరణ మార్పులపై విజయం సాధించడం ఖాయమని ఈ సదస్సు నిరూపించింది.

- Advertisement -