తమిళనాడులోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000కి పైగా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మోక్షపురిగా ప్రసిద్ధి చెందిన కాంచీపురంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. అత్తి వరదరాజస్వామి విగ్రహం 9 అడుగుల వరకు ఉంటుంది.సృష్టికర్త బ్రహ్మ దేవశిల్పి విశ్వకర్మతో విగ్రహాన్ని తయారుచేయించి పూజించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
యుగాలుగా ఇక్కడ అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలుగకుండా ఉండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట.
లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంత కాలంలో అంతా పరిస్థితి సర్దుకున్నాక అనేక కారణాలతో గర్భాలయంలో వేరొక దివ్య మూర్తిని ప్రతిష్టించారు. అప్పటినుంచి 40 సంవత్సరంలకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన అత్తి వరదరాజ స్వామి 2019 జులై ఒకటో తేదీన నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇవ్వనున్నారు.
గతంలో 1939, 1979 సంవత్సరాల్లో ఈ మహాక్రతువును నిర్వహించారు. తాజాగా కొత్త శతాబ్ధంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో స్వామివారిని చూసి తరించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో కంచి పట్టణం కిక్కిరిసిపోయింది.