ఆటలు రెండు దేశాల మధ్య సౌభాతృత్వాన్ని పెంచి పోషిస్తుంది. కాని భారత్-పాక్ మ్యాచ్‌లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తాయి. ఆసియా కప్ 2022లో భాగంగా ఈనెల 28న దాయాదులు తలపడనున్నాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ టోర్నీలోనైనా దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరం కనిపిస్తూ క్రీడాభిమానులను ఉత్సాహాన్ని నింపుతుంది. దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరానికి 20 రోజుల ముందుగానే వాతావరణాన్ని వేడెక్కించేందుకు టోర్నీ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఓ ఆసక్తికర ప్రోమోను విడుదల చేసింది.
ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌తో సమరానికి సై అన్నట్లుగా క్రీజ్‌లో కాలుదువ్వుతూ కనిపిస్తాడు. క్రికెట్ పరంగా భారత్-పాక్‌ల మధ్య ప్రత్యేక అనుబంధముందని, పాక్ జట్టులోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని రోహిత్ ఈ ప్రోమోలో ప్రస్తావిస్తాడు. భారత్ ఎనిమిదో సారి ఆసియా కప్ గెలవాలి, విశ్వవేదికపై భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడాలంటూ అభిమానుల్లో ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
రెండు దేశాలకు ఆగస్టు నెలతో ఒక సంబంధం ఉంది. రెండు దేశాలు స్వాతంత్ర్యం సాధించి 75వ వసంతాలు పూర్తి చేసుకుంటున్నాయి. 140 కోట్ల మంది భారత అభిమానులు ఇండియా.. ఇండియా అని ముక్తకంఠంతో నినదిస్తుంటే వినడం కంటే గొప్ప అనుభూతి ఉండదని, ఆసియా కప్‌లో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడిద్దాం రమ్మని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా విండీస్‌తో ముగిసిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.