ఒక ఉన్నత విశ్వవిద్యాలయంలో అత్యున్నతమైన ప్రొఫెసర్ పదవిలో ఉండి గూడా తన బాధ్యతను మరిచి మరోసారి కులాల గురించి అపహాస్యం చేసి మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు. గతంలో తిని కూర్చునే సోమరులుగా బ్రహ్మాణులను అభివర్ణించి క్షమాపణ చెప్పిన ఆయన తాజాగా కోమట్లు(ఆర్య వైశ్యులు) సామాజిక స్మగ్లర్లు అంటూ ఏకంగా పుస్తకం రాయడం వివాదానికి దారితీసింది.
ఈ పుస్తకంపై ఆర్యవైశ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అగ్రవర్ణాలను కించపరచడం ఐలయ్యకు అలవాటై పోయిందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేస్తున్నారు. పలు చోట్ల కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఒకరి దగ్గర చేయి చాచకుండా వృత్తిని దైవంగా భావించి కష్టనష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగుతున్న తమను వెకిలిగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని వైశ్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.ఆర్థిక క్రమశిక్షణకు వైశ్యులు మారు పేరని …దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన చరిత్ర ఘనత తమదని తెలిపారు. నాలుగు వందలకు పైగా దేవాలయాలు నిర్మించి నిర్వహిస్తున్న చరిత్ర వైశ్యులదని, ప్రతి రోజు అన్నదాన సత్రాలలో 50 వేల మంది భక్తులకు అన్న సంతర్పన చేస్తున్నామన్నారు.
ఇతర వర్గాలను కించపర్చడం ఐలయ్యకు అలాటైందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నాయకులు రమణ డిమాండ్ చేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని, పుస్తకం ముద్రించిన పబ్లిషర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని …ఇటీవల కర్నాటకలో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను హతమార్చినట్లు తనను కూడా చంపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తాను రాసిన పుస్తకం కాపీని పోలీసులకు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు.