బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కబీర్ ఖాన్ దృష్టి 1983లో భారత క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచకప్ మీద పడింది. కపిల్ దేవ్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టుతో పోరాడి భారత్ జట్టు ప్రపంచ కప్ గెల్చుకుంది. దీని ఆధారంగా త్వరలో ఓ సినిమాను తెరకెక్కించడానికి కబీర్ ఖాన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు `వరల్డ్ కప్ 1983` అని పేరు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ‘ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.. అలాగే సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు అదే తరహాలో భారత దేశానికి మొట్ట మొదటి వరల్డ్ కప్ ని అందించిన లెజండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కబోతోంది. సల్మాన్ తో బజరంగీ భాయీజాన్ – ట్యూబ్ లైట్ వంటి సినిమాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ అరుదైన జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాడు. అయితే కపిల్ దేవ్ పాత్రకు ఎవరిని సెట్ చేయాలనే విషయంపై దర్శకుడు గత కొంత కాలంగా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు.
అయితే తాజాగా ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర కోసం అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్, హృతిక్ రోషన్‌లను నిర్మాతలు సంప్రదించినట్లు, చివరికి అర్జున్ కపూర్ ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ ఈ చిత్రానికి కథ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 27న ఓ వేడుక నిర్వహించి తెలియజేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేడుకకు ఆనాటి వరల్డ్ కప్ ఆడిన క్రికెటర్లతో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం.