కాషాయమూకల అరాచకం..!

156
bengal
- Advertisement -

పశ్చిమబెంగాల్‌ ఎన్నికలలో గెలుపు కోసం బీజేపీ బరితెగిస్తోంది. ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తోంది. బరితెగించిన కాషాయ కార్యకర్తలు ఎన్నికల్లో అక్రమాలకు తెరతీశారు. టీఎంసీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ లోనూ అక్కడక్కడా హింస చెలరేగింది. టీఎంసీ, బీజేపీ శ్రేణులు ఘర్షణలకు దిగారు. హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా టీఎంసీ అభ్యర్థి సుజాతా మండల్ ఖాన్ పైనే దాడి జరిగింది. మూడో దశ పోలింగ్‌లో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇంతలో ఆరాంబాగ్‌లో టీఎంసీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం తలెత్తింది. ఈక్రమంలో టీఎంసీ మహిళా అభ్యర్థి సుజాత మండల్‌పై కొంత మంది బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. పోలింగ్ బూత్ నుంచి ఆమెను కొంత దూరం వరకు వెంటబడి తరిమారు.

తీవ్ర భయాందోళనకు గురైన ఆమె పరుగులు అందుకున్నారు. ఇంతలోనే మరికొంత మంది కాషాయ కార్యకర్తలు సుజాత మండల్‌‌పై కర్రలు, ఇటుకలతో దాడికి ప్రయత్నించారు. కాగా ఈ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. పోలింగ్ సందర్భంగా మంగళవారం ఆరాంబాగ్ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ స్టేషన్ పరిశీలనకు వెళ్లగా, కార్యకర్తల రూపంలోని బీజేపీ గుండాలు దాడికి పాల్పడ్డారని, కర్రలు, రాళ్లు ఇటుకలతో ఇష్టారీతిగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనలో ఎన్నికల సిబ్బందికి కూడా గాయాలయ్యాయని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని సుజాత్ మండల్ తెలిపారు. కాగా తమ పార్టీ మహిళా అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తల దాడిపై టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ మండిపడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా దాడులు చోటుచేసుకున్నాయని, బీజేపీ గుండాయిజానికి ఈసీ అడ్డుకట్ట వేయలేకపోతుందంటూ ఫైర్ అయ్యారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతను లక్ష్యంగా చేసుకుని కావాలనే ఈ దాడికి పాల్పడ్డారని, ఆరంబాగ్‌లో వివాదానికి కారణం కూడా బీజేపీయేనని మమత ఆరోపించారు.

బేటీ బచావో అని నినాదాలు చేసే బీజేపీ వాస్తవంలో మహిళలపై భయానక దాడులు చేస్తున్నదని, బీజేపీ గుండాయిజాన్ని అడ్డుకోవడంలో ఎన్నికల సంఘం మెతక వైఖరి అవలంభిస్తున్నదని దీదీ విమర్శించారు.కేంద్ర బలగాల బహిరంగ దుర్వినియోగం అప్రతిహతంగా కొనసాగుతోందని… చాలా ప్రాంతాల్లో పోలీస్, మిలటరీ యూనిఫాంలోని వ్యక్తులు ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ఓటర్లను ప్రభావితం చేస్తుండగా, ఈసీ మౌన ప్రేక్షక పాత్ర వహిస్తుందని మమత ఆరోపించారు. దళిత సామాజికవర్గానికి చెందిన సుజాతా మండల్.. బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య అయినప్పటికీ, భర్తతో విభేదించి టీఎంసీలో చేరారు. బీజేపీ కార్యకర్తలు ఒక మహిళ అని కూడా చూడకుండా టీఎంసీ మహిళా అభ్యర్థి సుజాత్ మండల్ వెంటపడి ఇటుకలతో దాడి చేసినా ఈసీ నోరుమెదపకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మహిళలపై దాడులకు పాల్పడున్న బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాలంటే మిగిలిన ఐదు విడతల్లో ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని మమతా బెనర్జీ బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తంగా టీఎంసీ దళిత మహిళ అభ్యర్థిపై కాషాయగూండాల దాడి ఘటన బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది.

- Advertisement -