గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా విడతల వారీగా ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.
ఇందులో భాగంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకే దశలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలోని 17లోక్సభ స్థానాలకూ ఏప్రిల్ 11నే ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జరగనున్న ఎలక్షన్ షెడ్యూల్ ఇదే..!
-మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్..
-మార్చి 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ..
-మార్చి 26 నామినేషన్ల పరిశీలన..
-మార్చి 28 నామినేషన్ల ఉపసంహరణ..
-ఏప్రిల్ 11న పోలింగ్..
-మే 23న ఓట్ల లెక్కింపు..